మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కొవిడ్-19 పరీక్ష కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కరోనా పరీక్ష కేంద్రం ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి వస్తున్న విషయం తెలుసుకున్న పలువురు కాంగ్రెస్ నాయకులు ఆస్పత్రి వద్దకు రాగా.. పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
అనంతరం మెదక్‌లో పరీక్ష కేంద్రం ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన తెలిపేందుకు స్థానిక జమ్మికుంట వాసులు ఆస్పత్రి వద్దకు వచ్చారు. అదే సమయంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి వాహనం అక్కడికి రావడం వల్ల వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీసులు వారిని అదుపు చేసే క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.
జనావాసాల మధ్య కరోనా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసం అని స్థానికులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. కరోనా సోకిన వారిని ఇక్కడికి తీసుకొచ్చి పరీక్షలు నిర్వహిస్తే.. ఇతరులకు సోకే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ల్యాబ్‌ను జనావాసాల మధ్య కాకుండా పట్టణ శివారులో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకే..
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాకు ఒక కొవిడ్-19 పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అందులో భాగంగానే ఏరియా ఆస్పత్రిలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరోనా లక్షణాలున్న బాధితుల రక్తపు నమూనాలను మాత్రమే ఇక్కడికి తీసుకురావడం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రం ఏర్పాటుతో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.