నకిలీ విత్తనాల విక్రయాలు జరగకుండా ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. నకిలీ విత్తనాలు, కరోనా నివారణ చర్యలు, హరితహారం వంటి అంశాలపై కలెక్టరేట్లో ఆయన చర్చించారు. నకిలీ విత్తన విక్రయదారులపై పీడీ యాక్ట్ కింద కేసుల నమోదు చేస్తామని హెచ్చరించారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే రైతులు కచ్చితంగా రశీదు పొందాలని సూచించారు.
స్వీయ నియంత్రణ వల్లే కరోనా నివారణ...
స్వీయ నియంత్రణతోనే కరోనాను నివారించడం సాధ్యమవుతుందని కలెక్టర్ చెప్పారు. పార్టీలు, పెళ్లిళ్లకు ఎక్కువ మంది హాజరవుతున్నందు వల్లే అధిక కేసులు నమోదవుతున్నాయన్నారు. అందువల్ల వాటికి వీలైనంత దూరంగా ఉండాలన్నారు. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలను స్వీకరించాలన్నారు. మెదక్లో ఏర్పాటు చేసిన కరోనా నిర్ధరణ పరీక్ష కేంద్రాల నిర్వహణపై అపోహలు వద్దని... అన్ని జాగ్రత్తలు తీసుకుని అక్కడ పరీక్షలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
48 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం...
ఈ నెల 25 నుంచి 6వ విడత హరితహారంలో భాగంగా 48 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. 25 శాఖల వారీగా లక్ష్యం కేటాయించామని... ఈసారి ఇనుప ట్రీ గార్డ్స్ ను ఏర్పాటు చేయనున్నామన్నారు. పండ్లు, పూలు, నీడనిచ్చే 60 లక్షల మొక్కలను పెంపొందించామన్నారు.