మెదక్ జిల్లా కలెక్టరేట్లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కొవిడ్, ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వంద మంది, ప్రైవేటు ఆస్పత్రులలో 206 మంది కరనా బాధితులు చికిత్స పొందుతున్నారని అన్నారు. ఇప్పటి వరకు 743 మంది కొవిడ్ రోగులకు రెమ్‌డెసివిర్ ఇచ్చామని, ఇంకా 219 అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రెమ్‌డెసివిర్, ఆక్సిజన్‌కు కొరత లేదని తెలిపారు. జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ లేనందున మెగా సంస్థ ఉచితంగా ఆక్సిజన్‌ను అందించాల్సిందిగా కోరమని చెప్పారు. పీహెచ్‌సీల్లో 3,550 ఆర్టీపీసీఆర్, 2,275 రాపిడ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్ కింద 10 మంది డాక్టర్లను, 20 మంది నర్సు పోస్టులను వెంటనే భర్తీ చేసి కొవిడ్ రోగులకు మరింత మెరుగైన సేవలు అందించాల్సిందిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు.
కొవాగ్జిన్ టీకా కొనుగోలు చేస్తున్నామని.. వచ్చిన వెంటనే జన సమూహంలో ఉండే 18-45 సంవత్సరాలలోపు వయసు గల వారికి ఇస్తామన్నారు. ఆటో, టాక్సీ, రేషన్ దుకాణాలు, కూరగాయలు, పండ్ల దుకాణాలు, మాంసం దుకాణాలు, పేపర్ బాయ్స్‌కు వ్యాక్సిన్ ఇస్తామని చెప్పారు. ఇంట్లో నుంచి ఒక్కరే బయటకు వచ్చి.. కావాల్సిన వస్తువులు వారానికి సరిపడ తీసుకెళ్లాలని కోరారు. జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల 11 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని అన్నారు. 25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సంగారెడ్డి జిల్లా రైస్ మిల్లర్లు తీసుకునేలా చూడాల్సిందిగా రాష్ట్ర పౌర సరఫరా కమిషనర్‌కు సూచించారు.
ఇదీ చదవండి: రహదారులపైకి వాహనదారులు.. సీజ్ చేస్తున్న పోలీసులు