విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు పంటల బీమా అన్నదాతలకు అండగా నిలుస్తుంది. అనుకోని సమయంలో సంభవించిన నష్టానికి అందే కొంత పరిహారం రైతుకు ఊరటనిస్తుంది. బీమా చేయడంలో వారు వెనకంజ వేయడం వల్ల ప్రస్తుతం ఏర్పడిన పంట నష్టానికి సాయం అందని పరిస్థితి నెలకొంది. జిల్లాలో మూడు రోజులుగా కురిసిన అకాల వర్షానికి వందలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.
కోతల సమయంలో పడిన రాళ్ల వానకు మడుల్లోనే ఉత్పత్తులు నానిపోయాయి. పంట నష్టపోయిన పుడమిపుత్రుల్లో పలువురికి బీమా సౌకర్యం లేకపోవడంతో కష్టాలు, నష్టాలే మిగలనున్నాయి. జిల్లాలో రబీ సీజన్‌లో 79,945 ఎకరాల్లో వరి, 8,768 ఎకరాల్లో మొక్కజొన్న, 2,416 ఎకరాల్లో జొన్న పంటలు సాగుచేశారు. ప్రస్తుతం వరి, మొక్కజొన్న చేతికందే సమయం... ఇప్పటికే జిల్లాలోని పలు మండలాల్లో కోతలు, నూర్పిళ్లు ప్రారంభమవడంతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మొక్కజొన్న కేంద్రాలూ త్వరలో అందుబాటులోకి రానున్నాయి. రెండు, మూడు రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో పంట ఉత్పత్తులపై ప్రభావం పడుతోంది. ఈదురుగాలులు, వర్షానికి వరి, మొక్కజొన్న, జొన్న పైర్లు దెబ్బతిన్నాయి. జిల్లాలోని పది మండలాల్లో అత్యధికంగా వరి పైరు నేలకొరిగి గింజలు రాలిపోయాయి. పాపన్నపేట, వెల్దుర్తి, కొల్చారం మండలాల్లో రైతులకు ఎక్కువ నష్టం వాటిల్లింది.
అన్నదాతలను ఆదుకుంటేనే...
ఆపత్కాలంలో సాయం కోసం పంటలకు బీమా చేసుకోవాలని వ్యవసాయ అధికారులు రైతులకు పదేపదే సూచిస్తుంటారు. ఈ మేరకు పలువురు ముందుకు వచ్చి ప్రీమియం చెల్లించి బీమా చేయించుకుంటారు. వరి పైరుకు ఎకరాకు రూ.510 చెల్లిస్తే బీమా వర్తిస్తుంది. రెండు రోజులుగా కురిసిన వర్షాలకు జిల్లాలో 1,430 మంది రైతులకు సంబంధించి 1,702.35 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది.
పంట నష్టపోయిన రైతుల్లో కేవలం 1,286 మందికి చెందిన 1,092.14 ఎకరాలకే బీమా చేయించారు. మిగిలిన 144 మంది ప్రీమియం చెల్లించలేదు. దీంతో వీరికి సంబంధించి 610.21 ఎకరాలకు పరిహారం అందని పరిస్థితి నెలకొంది. ఎకరాకు సుమారు రూ.30 వేల వరకు పెట్టుబడి వ్యయం చేసిన రైతులు అయోమయ స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.
ప్రభుత్వానికి నివేదించాం..
జిల్లాలో రెండు రోజులుగా జరిగిన పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. పంటల బీమా చేయించుకున్న రైతుల వివరాలను సంబంధిత బీమా సంస్థకు పంపాం. బీమా చేయించని రైతులు అకాల వర్షం వల్ల నష్టపోతే వారికి సాయం అందజేసే విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
- పరశురాంనాయక్, జిల్లా వ్యవసాయాధికారి
ఇవీచూడండి: తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రతిభ.. 9 వేలతో బ్యాటరీ సైకిల్