ఏడేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు వేచి చూస్తున్న పీఆర్‌సీ.. మోచేతికి బెల్లం పెట్టినట్లుగా ఉందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని గొల్లపల్లిలో రెండు రోజులుగా జరుగుతున్న శ్రీ కేతకి భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.
అధికారంలోకి రాగానే మెరుగైన ఫిట్మెంట్..
పీఆర్‌సీ.. ఉద్యోగుల కోరికల అనుగుణంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్ల కోసం రాజీపడి నీరు గారుస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రాగానే మెరుగైన ఫిట్మెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులను ఉద్యమంలో వాడుకుని వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల తరపున రాజీలేని పోరాటం చేస్తామన్న ఆయన... సీఎం కేసీఆర్ దమననీతికి నిదర్శనమని దుయ్యబట్టారు.
నియోజకవర్గంపై కాషాయం జెండా..
గత తొమ్మిదేళ్లుగా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ మల్లికార్జున భ్రమరాంబ ఉత్సవాలు ఎంతో వైభవంగా కొనసాగుతున్నయని రఘునందన్ రావు కొనియాడారు. రాబోయే రోజుల్లో నర్సాపూర్ నియోజకవర్గంపై కాషాయం జెండా ఎగురవేసేందుకు మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలని స్వామివారిని వేడుకున్నానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంఛార్జీ గోపి కౌన్సిలర్లు సురేష్, బుచ్చెష్ యాదవ్, పట్టణ అధ్యక్షులు అంజనేయులు గౌడ్, నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'ఎర్రకోట' ఘటనలపై దేశద్రోహం కేసు