కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. మొదటి రోజు తొలి టీకాను జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు తీసుకున్నారు. లాక్డౌన్ కాలంలోనూ సీఎం కేసీఆర్ పేద ప్రజలను ఆదుకున్నారని తెలిపారు. వైరస్ కారణంగా జిల్లాలో 38 మంది చనిపోవడం బాధాకరమైన విషయమన్నారు. .
శాస్త్రవేత్తల కృషి ఫలితం : జిల్లా వైద్యాధికారి
కరోనా వ్యాక్సిన్ కనుగొనడంలో మన శాస్త్రవేత్తలు అహర్నిశలు కృషి చేశారని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు అన్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి జ్వరం రావడం, వ్యాక్సిన్ ఇచ్చిన చోట వాపు, దురద వస్తుందని.. దీనికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. కరోనా వ్యాక్సిన్ వేసేందుకు ప్రాధాన్యతపరంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగ వైద్యసిబ్బందికి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, పోలీసులకు, పారిశుద్ధ కార్మికులకు దశల వారీగా ఇస్తామన్నారు. అనంతరం 50 సంవత్సరాలు పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి వ్యాక్సిన్ వేసే తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ఒక్కో వ్యక్తికి రెండు టీకాలు వేస్తేనే కరోనా అంతం అవుతుందని శాస్త్రవేత్తలు నిర్ణయించినట్లు వెల్లడించారు. మొదటి రోజు టీకా వేసిన 28 రోజుల తర్వాత రెండో టీకా తీసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ వేసిన ఐదు రోజులకు పనిచేస్తుందని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.