ఏంటీ... ఈ సైకిల్ తలకిందులుగా తొక్కుతున్నాడు? అదేంటీ.... సైకిల్ అంత ఎత్తుగా ఉందీ..? ఈ సైకిల్ మరీ విచిత్రంగా బైకును పోలి ఉందే? చూడడానికి కొంచెం కొత్తగా, మరికొంచెం వింతగా ఉన్న ఇవన్నీ ఏ ఇంజినీర్ ఆలోచనల్లోనో రూపుదిద్దుకున్నాయని అనుకుంటే పొరపాటే. వాటిని చేసింది 4వ తరగతిలో చదువు మానేసిన ఓ సామాన్యుడు. ఈ వింత సైకిళ్లు నడుపుతున్న వ్యక్తి పేరు అమ్జద్ పాషా. తయారు చేసిందీ తనే. స్వస్థలం మంచిర్యాలలోని మందమర్రి. పేదకుటుంబంలో పుట్టిన అమ్జద్.. 4వ తరగతిలో ఉండగా తండ్రి చనిపోయాడు. ఆర్థిక ఇబ్బందులకు తలొగ్గి చిన్నవయస్సుల్లోనే సైకిల్ షాపులో పనికి కుదిరాడు. క్రమంగా సైకిల్ రిపేరింగ్‌లో పట్టు సాధించి సొంత మెకానిక్ షాప్ ఏర్పాటు చేసుకున్నాడు.
15 అడుగుల సైకిల్
తనకంటూ ఓ ప్రత్యేకగుర్తింపు ఉండాలనే తపన ఎప్పుడూ అమ్జద్‌ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే.. 10అడుగులతో సైకిల్ రూపొందించిన ఓ పాకిస్థానీ.. గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నాడని తెలుసుకున్నాడు. దాంతో తానెందుకు ప్రయత్నించకూడదనే ఆలోచన తట్టింది. పైగా తనకు బాగా తెలిసిన వృత్తి కావడంతో ధైర్యంగా ముందడుగు వేశాడు. అప్పటి నుంచి వివిధరూపాల్లో, విభిన్న ఎత్తుల్లో సైకిళ్లు తయారు చేయడం ప్రారంభించాడు. కొంతకాలానికి.. గిన్నీస్‌బుక్‌లో స్థానం కోసం ఏకంగా 15అడుగుల సైకిల్‌ను తయారు చేసి ఔరా అనిపించాడు. దాంతో చాలా చోట్ల ప్రదర్శనలు సైతం ఇచ్చాడు.
వివిధ ఆకారాల్లో సైకిళ్లు
లక్ష్యం వైపు అడుగులు వేస్తున్న క్రమంలో అమ్జద్ జీవితంలో మరో దుర్ఘటన ఎదురైంది. ఎత్తైన సైకిల్‌పై నుంచి ఓ సారి ప్రమాదవశాత్తు కిందపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. రెండుచోట్ల ఎముకలు విరిగి 6 నెలలు మంచంలోనే ఉండిపోయాడు. రెక్కాడితే కానీ డొక్కాడనీ అమ్జద్‌ను... ఈ పరిస్థితులు ఎంతో ఇబ్బంది పెట్టినా కృంగిపోలేదు. ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డాడు. గాయాల నుంచి కోలుకున్నా.. గాయాలు ఇబ్బంది పెడుతుండడంతో ప్రయత్నాల్లో మార్పులు చేసుకున్నాడు. ఎత్తైన, పెద్ద వాహనాలే కాక.. అతి చిన్న వాహన నమూనాలనూ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తగ్గట్టే ఆకట్టుకునేలా... వివిధ ఆకారాల్లో సైకిళ్లు, మోటారు వాహనాలు తయారు చేస్తున్నాడు.
ఎన్నో అవార్డులు, రివార్డులు
వివిధ వాహనాల సూక్ష నమూనాలు చేసి సృజనాత్మకతతో చూపరులను కట్టి పడేస్తున్నాడు అమ్జద్. ద్విచక్ర వాహన భాగాల్ని సైకిల్‌తో అనుసంధానించడం, కారు, బైక్ టైర్లతో సైకిళ్లు తయారు చేస్తూ.. ప్రత్యేకత చాటుకుంటున్నాడు. కరోనా పేరుతో చేసిన సైకిల్ అందరి దృష్టి ఆకర్షిస్తోంది. అమ్జద్ ప్రతిభకు మెచ్చిన వివిధసంస్థలు 15కు పైగా అవార్డులు, రివార్డులతో సత్కరించాయి. విచిత్ర సైకిళ్లపై అమ్జద్ గజ్వేల్ పట్టణంలో తిరుగుతుంటే.. అందరూ వింతగా చూస్తుంటారు. పేదరికంలోనూ ప్రత్యేక గుర్తింపు కోసం అమ్జద్ చేస్తున్న ప్రయత్నాలు చూసి అభినందిస్తుంటారు. ప్రభుత్వం అండగా నిలిస్తే... మరిన్ని ఆవిష్కరణలు చేస్తాడు అంటున్నారు స్థానికులు.
నేను ప్రయత్నిస్తున్నా.. విజయాలు సాధిస్తున్నా. నో కాలేజ్ బట్ ఫుల్ నాలెడ్జ్ అంటూ సైకిళ్లపై రాసుకున్న... అమ్జద్‌కు చూస్తే ఆ మాటలు నిజమే అనిపిస్తుంది.
ఇదీ చదవండి: ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం..