రహదారులపై ప్రమాదాలతో మృత్యువాత పడుతున్న జంతువుల కళేబరాలను ఖననం చేయాలనే ఉద్దేశంతో మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఫ్రెండ్స్ యానిమల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర చేపట్టారు. ట్రస్ట్ నిర్వాహకుడు సందేశ్ గుప్తా, అతని స్నేహితుడు నరేష్ సైకిల్‌పై వారణాసి వరకు యాత్రగా బయలుదేరారు. యాత్రి దిగ్విజయంగా కొనసాగాలని స్థానికులు హనుమాన్ ఆలయంలో పూజలు చేసి వీడ్కోలు పలికారు. మరికొంతమంది యాత్రకు ఆర్థిక సాయం అందించారు.
ప్రధాన రహదారులపై వాహనాలు ఢీకొని పశువులు, జంతువులు అక్కడికక్కడే మృతి చెందుతున్నాయి. మనం కనీస బాధ్యతగా కూడా చూడటం లేదు. రహదారులపై చనిపోయిన జంతు కళేబరాలను వదిలి వెళ్లడం వల్ల పశువులకు, వాహనదారులకు ఇబ్బంది కలుగుతుంది. ఆ ఉద్దేశంతోనే ఈ యాత్ర చేపట్టాం.
-సందేశ్ గుప్తా, ఫ్రెండ్స్ యానిమల్ ట్రస్ట్ నిర్వాహకుడు, మంచిర్యాల
నెల రోజుల పాటు
జాతీయ రహదారి వెంట మంచిర్యాల నుంచి యూపీలోని వారణాసి వరకు 30 రోజులపాటు 25 వందల కిలోమీటర్ల సైకిల్ యాత్రను నిర్వహిస్తున్నామని సందేశ్ గుప్తా తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో తన యాత్ర గురించి తెలుసుకున్న జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన నరేష్ స్వచ్ఛందంగా తనతో పాటు పాల్గొంటున్నారని తెలిపారు. జంతు కళేబరాలను తామే స్వచ్ఛందంగా ఖననం చేస్తామని తెలిపారు. తమ యానిమల్ ట్రస్టు ద్వారా అడవుల్లో ఆహారం లేక అలమటిస్తున్న వానరాలకు పండ్లను అందించామని సందేశ్ గుప్తా తెలిపారు. జంతు ప్రేమికుడిగా స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఎస్సీ సాధికారతపై అఖిలపక్ష సమావేశం ప్రారంభం