లాక్డౌన్ వల్ల విద్యుత్తు శాఖ ఉద్యోగులు ఇంటింటికి తిరిగి బిల్లులు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో గతేడాది మార్చి, ఏప్రిల్ బిల్లులనే ఈసారీ చెల్లించాలని అధికారులు ప్రచారం చేస్తున్నారు.
చెల్లించాల్సిన మొత్తాన్ని సందేశం రూపంలో మీటరు సంఖ్యకు అనుసంధానంగా ఉన్న చరవాణికి ఇప్పటికే పంపించారు. ప్రజల నుంచి స్పందన నామమాత్రంగా ఉంది. ఆన్‌లైన్‌తో బిల్లు చెల్లించాలంటే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది మార్చిలో వినియోగం ఎక్కువగా ఉంది. ఈ ఏడాది తక్కువగా చేశాం.. అలాంటప్పుడు మేము నష్టపోతాం కదా అని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఎస్‌ఈ కార్యాలయంలోని ఓ అధికారి సమాధానమిస్తూ గతేడాది వాడకం తక్కువ, ఎక్కువ ఎలా ఉన్నా ఇబ్బందిలేదు. అప్పటి బిల్లుతోనే చెల్లించండి.
వినియోగదారుడికి నష్టం లేకుండా వచ్చే నెలలో విద్యుత్తు సిబ్బంది సరిచేసి బిల్లును అందిస్తారు. ఒకవేళ లాక్‌డౌన్‌తో మరోనెలలో కూడా సిబ్బంది వచ్చే అవకాశం లేకపోయినా ఆ తర్వాత నెలలో సరిచేస్తారు. లాక్‌డౌన్‌కు ముందు ఇచ్చిన బిల్లు తేదీ నుంచి ప్రతి 30 రోజులకు వేర్వేరుగా బిల్లు ఇస్తారు.
విద్యుత్తు బిల్లులు చెల్లించేందుకు సంబంధిత సంస్థ అనేక యాప్‌లు అందుబాటులో తీసుకొచ్చింది. ఆన్‌లైన్ ద్వారానే చెల్లించాలని సూచిస్తుంది. అయినా చాలా మంది వెనుకాడుతున్నారు. ప్రస్తుతమున్న వినియోగదారుల్లో 80 శాతం మందికి ఆన్‌లైన్‌తో చెల్లించేందుకు అవకాశం ఉన్నా ముందుకు రావడం లేదని ఓ విద్యుత్తు అధికారి తెలిపారు.
నేరుగా కార్యాలయానికి వచ్చి కట్టినా, ఆన్‌లైన్ ద్వారా చెల్లించినా ఏ మాత్రం తేడా ఉండదు. సూచించినా ఏ యాప్‌లో చెల్లించినా సంస్థకు చేరుతుంది. చరవాణికి వచ్చే సందేశాన్ని మాత్రం భద్రపరుచుకోవాలని సూచించారు.
బకాయిలు ఇలా..
మార్చినెల.. విద్యుత్తుశాఖకు వినియోగదారుల నుంచి రావాల్సిన మొత్తం: 10.79 కోట్లు
ఈనెల 27 వరకు ఆన్‌లైన్ ద్వారా చెల్లించింది: 3.22 కోట్లు
గతేడాది మార్చినెలకు సంబంధించింది: 10.02 కోట్లు
ఇదే తేదీ వరకు చెల్లించింది: 7.83 కోట్లు
ఈ ఏడాది ఫిబ్రవరికి సంబంధించింది: 10.29 కోట్లు
చెల్లించింది: 5.85 కోట్లు