రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లను మంచిర్యాలలోని రాజీవ్ నగర్లో జిల్లా పాలనాధికారి భారతి హోళీకేరి, ఎమ్మెల్యే దివాకర్ రావులు కలిసి ప్రారంభించారు. మొదటి దఫాలో 30 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ అందజేశారు. గత ప్రభుత్వాలు పేదలకు అరకొర సౌకర్యాలు అందించి గొప్పలు చెప్పుకున్నారని ఎమ్మెల్యే దివాకర్ రావు విమర్శించారు.
560 చదరపు అడుగుల స్థలంలో పేద ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా రెండు గదులతో ఇండ్ల నిర్మాణం ప్రభుత్వం చేస్తుందని కలెక్టర్ భారతి హోళీ కేరి తెలిపారు. మంచిర్యాలలో 650 మంది లబ్ధిదారులు ఉండగా.. 30 మందికి మొదట మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. మిగతా 620 లబ్ధిదారులకు త్వరలోనే నిర్మాణాలను పూర్తి చేసి అందిస్తామని వెల్లడించారు.
రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక రాజకీయ, కులమతాలకు అతీతంగా పారదర్శకంగా జరుగుతుందని ఎమ్మెల్యే, కలెక్టర్ అన్నారు. దళారులను నమ్మి పేద ప్రజలు మోసపోవద్దని సూచించారు. లాటరీ పద్ధతి ద్వారా ఇళ్లను పంపిణీ చేస్తామని జిల్లా పాలనాధికారి భారతి హోళీ కేరి వివరించారు.
ఇదీ చూడండి : ప్రమాదమని తెలిసినా... నీటితో ఆటలు