CM kCR Comments at Mancherial Public Meeting : భారత్‌కు తెలంగాణ తలమానికంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మంచిర్యాల సమీపంలోని నస్పూర్ వద్ద జరిగిన బహిరంగసభలో పాల్గొన్న సీఎం కాంగ్రెస్, బీజేపీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. తెలంగాణ వజ్రపుతునకగా ఉన్న సింగరేణిని రెండు పార్టీలు నాశనం పట్టించాయని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో అప్పులు తెచ్చి కేంద్రానికి 49 శాతం వాటా కట్టబెడితే...భాజపా బొగ్గుగనులను ప్రైవేటీకరిస్తూ... సిరుల సంస్థను మూసేయాలని చూస్తోందని ఆక్షేపించారు.
తెలంగాణ ఆ రంగాల్లో నంబర్ వన్‌గా ఉంది : కొత్త జిల్లాల్లో చక్కటి కలెక్టరేట్లు నిర్మించుకుంటున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. మంచిర్యాల జిల్లా కోసం గతంలో జిల్లా వాసులు ఎన్నో ధర్నాలు చేశారన్న సీఎం... జిల్లా కేంద్రాల్లో పని కోసం దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. తాగు, సాగు నీటి సరఫరాలో ఇవాళ తెలంగాణ నంబర్ వన్‌గా ఉందన్న సీఎం కేసీఆర్... ఉచిత విద్యుత్, నిరంతర విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. అలాగే వరి సాగులో పంజాబ్‌ను కూడా మించిపోయామన్న ఆయన.. యాసంగిలో దేశం మొత్తం కలిపి 94 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందన్నారు. యాసంగిలో తెలంగాణలోనే 56 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశామని తెలిపారు. ఇప్పటికీ భారత్ వంట నూనెను ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుందన్నారు.
'మంచిర్యాలలో రూ.500 కోట్లతో పామ్ ఆయిల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నాం. తలాపున పారుతోంది గోదారి.. మనచేను, మన చెలక ఎడారి.. అని సదాశివం పాట రాశారు. తెలంగాణ వచ్చాక ఇప్పుడు నీటి గోస తీరింది. వేలాది మందికి అన్నం పెట్టిన సంస్థ సింగరేణి. ఇవాళ సింగరేణి టర్నోవర్‌ను రూ.33 వేల కోట్లకు పెంచాం. వచ్చే దసరాకు సింగరేణి కార్మికులకు రూ.700 కోట్ల బోనస్ పంచనున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో 6,403 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది. ఈ ప్రభుత్వం సింగరేణిలో 19 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చింది.'-ముఖ్యమంత్రి కేసీఆర్
cm kcr announces thousand additional pension to divyang : సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేయాలని కేంద్రం చూస్తోందన్న కేసీఆర్.. బాగా బతుకుతున్న ఇక్కడి ప్రజలను నాశనం చేయాలని చూస్తోందన్నారు. దేశంలో సరిపడా బొగ్గు ఉన్నా... ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేస్తోందన్నారు. సింగరేణిని కాంగ్రెస్ సగం ముంచితే, బీజేపీ పూర్తిగా ముంచుతోందన్నారు. సింగరేణిని ఇంకా విస్తరించాలని రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ మంచిర్యాల సభా వేదికగా వికలాంగుల పింఛను మరో వెయ్యి పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. వచ్చే నెల నుంచి దివ్యాంగులకు రూ.4116 పింఛను అందిస్తామని పేర్కొన్నారు.
'తెలంగాణలో ఉన్నట్లు విద్యుత్ మరే రాష్ట్రంలోనూ లేదు. ఫ్యాన్లు, ఏసీలు బంద్ చేసుకోవాలని కొన్ని రాష్ట్రాల్లో సీఎంలు పిలుపునిచ్చారు. విద్యుత్ సరిపడా లేక.. ప్రభుత్వ ఆఫీసులు ఒక్కపూట పెట్టారు. దేశ రాజధాని దిల్లీలోనూ విపరీతమైన కరెంట్ కోతలు. రైతు ఏ కారణంతో చనిపోయినా.. 10 రోజుల్లోనే రూ.5 లక్షల చెక్కు ఇస్తున్నాం. ధరణి పుణ్యం వల్లే రైతుబంధు, రైతుబీమా అమలవుతోంది. 99 శాతం రైతుల భూములు ధరణిలో నమోదై ఉన్నాయి. ఒక్క రైతు బొటనవేలుతో మాత్రమే భూమి వివరాలు మారతాయి. మూడేళ్లు కష్టపడి ధరణి పోర్టల్‌ను రూపొందించాను. రైతు భూమిని ఎవరూ ఆక్రమించకుండా చేశాం. వీఆర్‌వో, తహశీల్దార్‌కు లంచం ఇచ్చే పని లేకుండా చేశాం.'-సీఎం కేసీఆర్
ఆపద మొక్కులు మొక్కేవారిని నమ్మి మోసపోవద్దు : ధరణి పోర్టల్‌ను బంగాళఖాతంలో కలుపుతామనే కాంగ్రెసోళ్లనే సముద్రంలో వేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. అవినీతికి, దళారీ వ్యవస్థకు తావులేని రీతిలో ధరణిని అందుబాటులోకి తెచ్చామని వివరించారు. ధరణి లేకపోతే... మళ్లీ లంచగొండి వ్యవస్థ రైతుల ఉసురు తీస్తుందని స్పష్టం చేశారు. ధరణి లేకుంటే రైతుబంధు ఎలా వస్తుందో ఆలోచించాలన్నారు. తెలంగాణలో ఉన్నట్లు గురుకులాలు ఏ రాష్ట్రంలోనూ లేవన్న కేసీఆర్... ఆ విద్యార్థులు చక్కగా ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారన్నారు. ఆపద మొక్కులు మొక్కేవారిని నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. ఎన్నికల్లో గట్టెక్కడానికి మోసం మాటలు చెప్తారని సీఎం కేసీఆర్ అన్నారు.
ఇవీ చదవండి :