modern markets: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కూరగాయలు, మాంసాహార మార్కెట్ల ఏర్పాటు ప్రక్రియ ప్రహసనంగా మారుతోంది. గతంలో నిర్మించిన మార్కెట్లు, రైతు బజార్లు వినియోగంలో లేకపోగా.. కొత్త సమీకృత మార్కెట్ల నిర్మాణాలు నత్త నడకన సాగుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో పాత రైతుబజార్ సహా వివిధ ప్రాంతాల్లో కూరగాయల క్రయవిక్రయాలు రోడ్లపైనే సాగుతున్నాయి. కొత్తగా నిర్మించిన ఆధునిక రైతు బజార్ అలంకారప్రాయంగా మిగిలింది. దాదాపు 200 మంది కూరగాయలు అమ్ముకునేందుకు వసతులున్నా.. రైతులెవరూ రావడం లేదు. రైతులందరిని ఇక్కడకు రప్పించేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకుండాపోయింది. రూ.ఐదున్నర కోట్లతో నిర్మించిన రైతుబజారు పూర్తిస్థాయిలో వినియోగంలో లేకుండాపోతోంది.
జడ్చర్లలోనూ మార్కెటింగ్ శాఖ నిర్మించిన రైతు బజారు ప్రస్తుతం ఖాళీగానే ఉంది. ఊరికి దూరంగా ఉండటం, స్థలం చాలక పోవడం, వినియోగదారులు ఎవరూ రాకపోవడంతో రైతులెవరూ అక్కడకు వెళ్లడం లేదు. ప్రధాన రహదారులు, కూడళ్లలో కూరగాయలు అమ్ముతున్నారు. రోడ్లపైనే క్రయవిక్రయాలు సాగడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది.
వనపర్తిలో ఇప్పటికే నిర్మించిన చేపల మార్కెట్, కూరగాయల మార్కెట్ వినియోగంలో లేవు. నారాయణపేటలో చికెన్-ఫిష్ మార్కెట్ నిరుపయోగంగా ఉంది. నారాయణపేట రైతుబజారు ఉదయం మినహా.. మిగిలిన వేళల్లో ఖాళీగానే దర్శనమిస్తుంది.
పాత మార్కెట్ల పరిస్థితి ఇలా ఉంటే.. ప్రజారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నిధులతో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్లు సైతం నత్తనడకన సాగుతున్నాయి. 19 పురపాలికల్లో 16చోట్ల నిర్మిస్తుండగా... కేవలం మహబూబ్‌నగర్, నారాయణపేట, కోస్గిలో పనులు జోరుగా సాగుతున్నాయి. అమరచింత, ఆత్మకూర్, శాంతినగర్‌లో పనులు ప్రారంభం కాకపోగా.. అచ్చంపేట, కొల్లాపూర్‌లో భూసమస్యలున్నాయి. మిగతా ప్రాంతాల్లో వివిధ దశల్లో ఉన్నాయి.
పాతమార్కెట్లు సద్వినియోగంలో లేక కొత్త మార్కెట్ల నిర్మాణం నత్తనడకన సాగడంతో పుర ప్రజలకు ఒకే చోట అన్ని అవసరాలు తీరడం కష్టంగా మారుతోంది.
ఇవీ చూడండి..