Udandapur Reservoir Residents Issues: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉందడాపూర్ వద్ద జలాశయాన్ని నిర్మిస్తున్నారు. ఈ రిజర్వాయర్‌లో వల్లూరు, ఉదండపూర్ గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయి. జలాశయం కోసం సర్వస్వం త్యాగం చేసిన ఆ గ్రామాల ప్రజలు.. ప్రస్తుతం భయం గుప్పిట బతుకీడుస్తున్నారు. ఈ రెండు గ్రామాల చుట్టూ జలాశయ కట్ట నిర్మాణ పనులు జోరుగా సాగగా వరదనీరు గ్రామాలను చుట్టుముడుతోంది.
అధిక వర్షాలకు చెరువులు నిండి లోతట్టు ప్రాంతాలకు నీరు చేరుతోంది. ముంపు గ్రామమైన వల్లూరు ఎస్సీ కాలనీలోకి నీరు చేరింది. ఇళ్లలోకి పాములు, తేళ్లు వస్తున్నాయని గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు. వానలకు ముంపు గ్రామాల్లోని ఇళ్లు సైతం కూలిపోతున్నాయి. ముంపు గ్రామాలు కావడంతో ప్రస్తుతం అక్కడ ఎలాంటి ప్రభుత్వ, అభివృద్ధి పనులు జరగడం లేదు.
ఇప్పటికే జడ్చర్ల నుంచి ఈ గ్రామాలకు వెళ్లే రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పైగా జలాశయ నిర్మాణంలో భాగంగా వచ్చే భారీ వాహనాలు తిరగడంతో రోడ్లు ఘోరంగా మారాయి. వీటికి వానలు తోడవటంతో ఇక్కడికి రాకపోకలు సాగించాలంటే నరకం చూడాల్సిందే. కట్ట నిర్మాణం కోసం భూములను ఎక్కడపడితే అక్కడ తవ్వేయడంతో.. ఆ భారీ గుంతలు చెరువులు, కుంటల్ని తలపిస్తున్నాయి. ఎక్కడ ప్రమాదం పొంచి ఉందో ఎవరికీ తెలియని దుస్థితి నెలకొంది.
నిబంధనల మేరకు ముంపు గ్రామాలైన వల్లూరు, ఉదండపూర్ ప్రజలకు పునరావాసం కల్పించడంతో పాటు కోల్పోయిన ఇళ్లకు పరిహారం, ప్యాకేజీ చెల్లించాలి. కానీ సర్వేలో జాప్యం కావడంతో ఆ ప్రక్రియ వేగంగా జరగలేదు. నిర్వాసితులకు ఇండ్ల స్థలాలు కేటాయించడం కోసం దగ్గర్లోనే స్థలాన్ని ఎంపిక చేసినా కేటాయింపు పూర్తి కాలేదు. కోల్పోయిన ఇళ్లకు పరిహారం, ప్యాకేజీ సైతం చెల్లించలేదు.
ప్రభుత్వం ఇచ్చేదేదో ఇచ్చేస్తే.. ముంపు గ్రామాల నుంచి తరలివెళ్తామంటున్నారు నిర్వాసితులు. కంటికి రెప్పలా కాపాడుకుంటామన్న అధికారులు, ప్రజాప్రతినిధులు.. ప్రస్తుత కష్ట సమయంలో పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. చుట్టూ కట్ట నిర్మాణం పూర్తి కావడంతో.. ఎగువ ప్రాంతాల నుంచి జలాశయం లోపలి భాగంలోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది.
గతేడాది సైతం వానాకాలంలో నిర్వాసిత గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పునరావాస చర్యలను మరింత వేగవంతం చేయాలని బాధితులు కోరుతున్నారు.
"చెరువులు నిండిపోయాయి. తద్వారా ఇండ్లలోకి నీళ్లు వస్తున్నాయి. ప్యాకేజీ మాకు ఇస్తే మేమే ఊరు వదిలి వెళ్లిపోతాం. మూడు నెల్లలో ఇస్తామన్న ప్యాకేజీ మూడు సంవత్సరాలైనా ఇవ్వలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పునరావాస చర్యలను మరింత వేగవంతం చేయాలని కోరుతున్నాం." -నిర్వాసిత గ్రామాల ప్రజలు
ఇవీ చదవండి: టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు.. ఎప్పటినుంచంటే?
ప్రొఫెసర్ సాయిబాబాకు షాక్.. హైకోర్టు తీర్పును సస్పెండ్ చేసిన సుప్రీం