మహబూబాబాద్ జిల్లా ప్రజలను పులి భయపెడుతోంది. గతకొద్ది రోజులుగా పులి సంచరిస్తున్న గుర్తులు బయటపడుతున్నాయి. రోజుకో చోట పెద్దపులి సంచరించిన గుర్తులు వెలుగుచూస్తున్నాయి. పలు మండలాల్లోని గ్రామాల్లో పులి ఆనవాళ్లు కన్పించగా... రైతులు, గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆయా ప్రాంతాలను పరిశీలించిన అధికారులు అవి పెద్దపులి అడుగులుగా గుర్తించారు.
పులి భయంతో తమ వ్యవసాయ పనులను వదిలి పెట్టి ఇంటి వద్దనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి పులిని పట్టుకోవాలని కోరుతున్నారు. 2012లో గంగారం, కొమరారం గుట్టల్లో ఓ పులి... వేటగాళ్లు పెట్టిన ఉచ్చులో చిక్కుకుని చనిపోయిందని అటవీ అధికారి కృష్ణమాచారి తెలిపారు. అడవుల్లో సోలార్ పంప్ పంపు సెట్లు, నీటి గుంటలు ఏర్పాటు చేయడం వల్ల శాకాహార జంతువులు పెరిగాయన్నారు. దీని వల్ల 8 ఏళ్ల తర్వాత మళ్లీ జిల్లాలో పులి సంచరిస్తుందని... ఇది చాలా శుభపరిణామమన్నారు.
అటవీ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురికావద్దని... ఇద్దరు, ముగ్గురు కలిసి వ్యవసాయ పనులకు వెళ్లాలని సూచించారు. పశువుల కాపర్లు అడవిలోకి వెళ్లకూడదని... పులిని చంపేందుకు ఉచ్చులు పెట్టడం గానీ... క్రిమిసంహారక మందులను వాడటం గానీ చేయవద్దని తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే... వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం ఏడేళ్ల వరకు శిక్ష పడుతుందని హెచ్చరించారు. పులి బారిన పశువులు కానీ, మనుషులు కానీ పడినట్లయితే వెంటనే సమాచారం ఇవ్వాలని తెలిపారు.