లాక్‌డౌన్ నేపథ్యంలో రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి యజమాని ఖాతాలో నెలకు రూ.1,500 చొప్పున ఏప్రిల్, మే రెండు నెలల పాటు నగదు జమ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చిలో ప్రకటించారు. కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం, రూ.1,500 నగదును ఇచ్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నిబంధనల ప్రకారం అధికారులు లబ్ధిదారుల సంఖ్యను బట్టి బియ్యం పంపిణీ, యజమాని ఖాతాలో నగదు జమచేసే కార్యక్రమం ప్రారంభమైంది.
ఇందులో కొంత మందికి బియ్యం, నగదు పంపిణీ చేసినప్పటికీ మరికొందరికి నగదు అందడం లేదు. ఏప్రిల్ మాసానికి సంబంధించిన నగదు జమకాని లబ్ధిదారులు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా లక్షకుపైగా ఉన్నారు. వీరు బియ్యం తీసుకున్నా వారి ఖాతాలో నగదు జమ కాలేదు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని లబ్ధిదారులు వాపోతున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ వృద్ధుడు రేషన్ కార్డుతో బియ్యం తీసుకున్నాడు. నగదు కోసం బ్యాంకులు, పోస్టాఫీసు చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా నగదు వివరాలు తెలియరాలేదు. అయిజ మండల కేంద్రంలో ఓ మహిళకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో బియ్యం తీసుకొని నగదురాని లబ్ధిదారులు పదుల సంఖ్యలో ఉన్నారు.
ఇలా ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని ఐదు జిల్లాల్లో 1,02,308 మంది లబ్ధిదారులు ఉన్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 37 వేలకు పైగా లబ్ధిదారులు నగదు రాని వారి జాబితాలో ఉన్నారు. ఈ విషయంపై ‘ఈనాడు’-ఈటీవీ భారత్ ఐదు జిల్లాల పౌర సరఫరాలశాఖ అధికారులను సంప్రదించగా వరుసగా ఆరు నెలల నుంచి రేషన్ బియ్యం తీసుకోని వారికి డబ్బులు రావడం లేదని మహబూబ్‌నగర్ జిల్లా అధికారులు చెప్పారు. 3 నెలల నుంచి బియ్యం తీసుకోకపోవడం వల్ల నగదు జమకావడం లేదని నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లా అధికారులు పేర్కొంటున్నారు.