RPF constable rescued woman : కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై... ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించిన ఓ మహిళను.. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాపాడింది. ఈనెల 7న మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్లో జరిగిన ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం మోతీనగర్ వార్డుకు చెందిన యాదమ్మ(40) కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది... ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఈ క్రమంలో ఈనెల 7న మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్ వచ్చింది. ఏపీ నుంచి దిల్లీ వెళ్తున్న సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్... స్టేషన్‌కు సమీపిస్తున్న సమయంలో ఒక్కసారిగా ట్రాక్‌మీదకు వెళ్లి నిలబడింది.
అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పూనమ్... ఆమెను గుర్తించి పక్కకు లాగేయడంతో ప్రాణాలతో బయటపడింది. పట్టాలపై మహిళను గుర్తించిన లోకోపైలట్ అత్యవసర పరిస్థితిలో రైలును నిలిపేశారు. అనంతరం 25 నిమిషాల ఆలస్యంగా రైలు బయలుదేరి వెళ్లింది. యాదమ్మను అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు... ఆమెకు కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రెప్పపాటులో మహిళను కాపాడిన ఆర్పీఎస్ కానిస్టేబుల్ పూనమ్‌ను రైల్వే సిబ్బంది, అధికారులు అభినందించారు.
ఇదీ చూడండి: కదులుతున్న రైలు నుంచి దిగబోయి..