ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారులు, సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకమని ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా పరిశీలకులు హార్ ప్రీత్ సింగ్ అన్నారు. మహబూబ్‌నగర్ -రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల స్థానం ఎన్నికల నిర్వహణపై మహబూబ్‌నగర్ కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల నోడల్ అధికారులు, సెక్టోరల్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఎన్నికల సామగ్రి సమీకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని, బ్యాలెట్ పేపర్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ఏర్పాటుతో పాటు, ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్ జారీ చేయాలని సూచించారు. ఇప్పటి వరకు జిల్లాలో పట్టుకున్న మద్యం, డబ్బు తదితర వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన... తనిఖీలలో భాగంగా అన్ని వాహనాలను తనిఖీ చేయాలని సూచించారు.
అనంతరం ఎన్నికల సూక్ష్మ పరిశీలకులతో సమావేశమై... ఎన్నికల నిర్వహణలో నిశిత దృష్టి ఉండాలని.. ఎన్నికల సంఘం జారీ చేసిన నియమాల మేరకు సూక్ష్మ పరిశీలకులు వారి విధులు నిర్వహించాలని అదికారులకు సూచించారు. అంతకుముందు జడ్చర్ల, భూత్పూర్ మండలాల పరిధిలో పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావుతో కలిసి పరిశీలించారు.
ఇదీ చూడండి: 'ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల మధ్య తెరాస చిచ్చు పెడుతోంది'