పోతిరెడ్డిపాడు అంశంపై తెలంగాణ ప్రభుత్వంపై రాజకీయ కోణంలో విమర్శలు చేస్తే ప్రయోజనం ఉండదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు. కేంద్రంపై భాజపా ఒత్తిడి తెచ్చి పోతిరెడ్డిపాడును అడ్డుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని పేర్కొన్నారు.
మహారాష్ట్ర, కర్ణాటకను ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర ప్రాజెక్టుల కోసం అన్ని పార్టీలు ఏకం కావాలి. రాజకీయం, ఎన్నికల కోసం పనిచేయకుండా జిల్లా కోసం జిల్లా ప్రయోజనాల కోసం కలిసి పని చేయాలి. వాళ్లు కింద తవ్వితే మనం పైన తవ్వుకునే అవకాశం ఉంది. ఎత్తుకు పై ఎత్తు వేసి అడ్డుకుంటాం.
- శ్రీనివాస్ గౌడ్, ఎక్సైజ్ శాఖ మంత్రి
తెలంగాణలో జలదోపిడీకి సహకరించిన వాళ్లే ఇప్పుడు మాట్లాడుతున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. హంతకులే పోయి సంతాపం తెలిపినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఇవాళ పోతిరెడ్డిపాడును వ్యతిరేకిస్తున్న వాళ్లు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
పాలమూరు- రంగారెడ్డిని అడ్డుకునేందుకు కేసులు వేసింది మీరే కదా. రాష్ట్రంలోని సక్రమ ప్రాజెక్ట్‌లపై కేసులు వేసిన నాయకులు ఏపీ అక్రమ ప్రాజెక్ట్‌లపై ఇప్పటి వరకు ఒక్క కేసు వేశారా? పోతిరెడ్డిపాడును అడ్డుకోడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రెండు జాతీయ పార్టీల అధిష్ఠానాల నుంచి పోతిరెడ్డిపాడు వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ప్రధానికి వినతి పత్రం ఇవ్వండి. లేదంటే విమర్శలు మానుకోండి.
- నిరంజన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి
ఇదీ చదవండి: పోతిరెడ్డిపాడు అంశంపై ఈఎన్సీకి అఖిలపక్షం వినతిపత్రం