మహబూబ్‌నగర్ జిల్లాలో ఆర్టీపీసీఆర్ పరీక్షలను వేగవంతం చేయనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో న్యూ ఆటోమేటిక్ న్యూక్లియర్ ఎస్ట్రాక్షన్ మిషన్‌ను మంగళవారం ప్రారంభించారు. ఈ మిషన్‌తో కేవలం రెండున్నర గంటలలోపే కొవిడ్ నిర్ధరణ ఫలితాలు వస్తాయని చెప్పారు. త్వరలోనే ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ విపత్కర కాలంలో సేవలు అందించేందుకు హౌస్ సర్జన్లు ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వైద్య విద్యార్థులపై ప్రభుత్వం రూ.లక్షలు ఖర్చు చేస్తోందని... ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి సేవ చేయడంలో ముందుండాలని కోరారు.
కొరత లేదు
జిల్లా కేంద్రంలో కొవిడ్ చికిత్స అందించే ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో అదనపు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్‌తో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వైద్య బిల్లులపై ఆరా తీశారు. మానవతా దృక్పథంతో ఫీజులు వసూలు చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడికి సహకరించాలని కోరారు. అవసరమైన మందులు, ఆక్సిజన్, ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
తెలుగు రాష్ట్రాలకు 600
అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు 20 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఉచితంగా అందించారు. 5ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు ఆట ప్రతినిధులు అందజేశారు. తెలుగు రాష్ట్రాలకు 600 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఆట ఆధ్వర్యంలో ఇవ్వాలని నిర్ణయించామని నటుడు లోహిత్ కుమార్ తెలిపారు. అందులో భాగంగా మొదటి రోజున వరంగల్, నిజామాబాద్, మంగళవారం మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, అచ్చంపేట, జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రులకు అందించినట్లు తెలిపారు. అనంతరం కల్యాణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు మెడికల్ ఎమర్జెన్సీ కిట్, నిత్యావసర సరుకులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: ఇంటింటి సర్వే.. మూడున్నర లక్షల మందిలో లక్షణాలు