అన్న లేని జీవితం నాకొద్దని సూసైడ్ లెటర్ రాసి అదృశ్యమైన ఓ తమ్ముడు... మూడేళ్ల తర్వాత శవమై కనిపించాడు. "అన్నదమ్ములు విడిపోవాలంటే ఆస్తి పంపకాలు, భార్యాభర్తలు విడిపోవాలంటే విడాకులు, స్నేహితులు విడిపోవాలంటే మరణమే... నాకు తోడుగా ఉండే నా అన్న లేని జీవితం నాకు వద్దు.. నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను.. నా వాటా భూమి అమ్మి అమ్మ పేరు మీద వేయండి" అని లేఖలో రాసి... 2016 డిసెంబర్లో అదృశ్యమయ్యాడు.
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ గ్రామానికి చెందిన అంజయ్య, గంగమ్మ దంపతులకు నలుగురు కుమారులు. చిన్న కుమారుడు పాండు, మూడోవాడు కుమార్ స్నేహంగా ఉండేవాడు. కుమార్ 2016లో కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణించాడు. అన్న మరణంతో కుంగిపోయిన పాండు జీవితం మీద విరక్తి పెంచుకున్నాడు. సూసైడ్ నోట్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆచూకీ దొరకలేదు.
తాజాగా సినీనటి అమల ఫాంహౌస్లో కూలీలు పనిచేస్తుండగా... ఓ శవం కనిపించింది. పోలీసులకు సమాచారం ఇచ్చారు. శవానికి పంచనామా నిర్వహించగా 2016లో అదృశ్యమైన పాండుగా పోలీసులు తేల్చారు. ఎముకల గూడు మాత్రమే మిగిలినందున మూడేళ్ల క్రితమే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. పాండు కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆస్తుల కోసం అన్నదమ్ములు ప్రాణాలు తీసుకుంటున్న ఈ రోజుల్లో... అన్న లేడని తమ్ముడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అందర్నీ కంటతడి పెట్టిస్తోంది.
ఇదీ చూడండి: అతివేగంతో కారు బోల్తా... వ్యక్తి దుర్మరణం