రైతులకు ప్రయోజనాలు చేకూరేలా ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని... వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ ఏడాది నియంత్రిత వ్యవసాయ విధానం అమలుతో సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. మనరాష్ట్రంలో పండించిన సన్నవరికి ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉందన్నారు.
వ్యవసాయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త విధానాలను రైతులకు అర్థమయ్యేలా అధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలోని 88 క్లస్టర్లలో రైతు వేదికలను నిర్మించడం జరిగిందని తెలిపారు. సాగులో మెలకువలు పాటిస్తూ సిరులు పండిస్తున్న ఆదర్శ రైతులను జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సన్మానించారు.