ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో లాక్డౌన్ కొనసాగుతోంది. ప్రభుత్వం ప్రకటించిన అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు దాదాపుగా మూతపడ్డాయి. ఉదయం 6 గంటలకు జనతా కర్ఫ్యూ ముగియగా.. నిత్యవసరాల కోసం జనం పెద్ద ఎత్తున బయటకు వచ్చారు. ఆరు గంటల నుంచే కూరగాయల మార్కెట్లు కిటకిటలాడాయి. వారం రోజుల సరుకుల కోసం జనం కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లలోకి ఎగబడ్డారు. పెట్రోలు బంకులు సైతం 24 గంటల తర్వాత తెరవగా.. జనం బారులు తీరారు.
ఆదేశాలు బేఖాతరు..
ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోగా.. ఆటోలు, కార్లు, ప్రైవేటు వాహనాలు మాత్రం పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చాయి. కుటుంబానికి ఒక్కరే బయటకు రావాలన్న విజ్ఞప్తిని కొందరు పాటిస్తే.. చాలామంది పాటించలేదు. మాస్క్లు, రక్షణ చర్యలు లేకుండా జనం రోడ్లపైకి వస్తున్నారు. ఒకే చోట ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడకూడదని అధికారులు పదే పదే చెప్పినా.. కూరగాయల మార్కెట్లు, కిరాణ దుకాణాల్లో ఆ పరిస్థితి కనిపించలేదు.
వారిపై నిఘా..
ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చిన వాళ్లు, జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వాళ్లు గమ్యస్థానాలు చేరుకునేందుకు ప్రయాణం చేస్తున్నారు. అంతరాష్ట్ర సరిహద్దుల నుంచి ఎవరినీ.. జిల్లాలోకి అనుమతించడం లేదు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారిపై నిఘా కొనసాగుతోంది. ఇళ్లలో స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన వాళ్లు.. బయట తిరిగితే... క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తామని ఇప్పటికే పలుమార్లు కలెక్టర్లు హెచ్చరికలు జారీ చేశారు.
ఇదీ చదవండి: సుప్రీంలో ఒకే ధర్మాసనం.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ