మహబూబ్నగర్లో చేపట్టిన రోడ్డు విస్తరణలో భాగంగా భవనాలు, ఆస్తులు కోల్పోతున్న బాధితులు కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు. బాధితులకు నాలుగు రెట్ల విలువతో టీడీఆర్ సర్టిఫికెట్లు అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... నిరసన తెలిపారు.
మాస్టర్ ప్లాన్ ప్రకారం వంద అడుగుల మేర రోడ్డు నిర్మించాల్సి ఉన్నా... అధికారులు 120 అడుగులకు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారని బాధితులు ఆరోపించారు. ఈ నిర్ణయం వల్ల తమ ఆస్తులు ఎక్కువ స్థాయిలో కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు టీడీఅర్ సర్టిఫికెట్లు వద్దని... కోల్పోతున్న ఆస్తులకనుగుణంగా పరిహారం చెల్లించాలని కోరారు. జిల్లా అధికారుల నుంచి తమ సమస్యకు పరిష్కారం దొరకకపోతే... పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.