హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని జడ్చర్లలో ఎకరా భూమి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.2 కోట్లకుపైగానే పలుకుతోంది. ఈ ప్రధాన రహదారి పక్కనే నల్ల చెరువు(Jadcherla Nalla cheruvu) ఉంది. దీని శిఖం 20.15 ఎకరాలు. దీంతో స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. ఇప్పటికే శిఖంలో స్థిరాస్తి వ్యాపారం కోసం కడీలు పాతి ప్లాట్లు చేశారు. నిర్మాణాలూ వెలిశాయి. తాజాగా ఈ చెరువుకు ఉన్న పాటు కాలువను(Jadcherla Nalla cheruvu) పలు చోట్ల ధ్వంసం చేశారు. దానిపైనే ఓ వెంచరుకు రోడ్డును వేశారు. భారీ వర్షాలు పడితే జడ్చర్ల సమీపంలో ఉన్న శివగిరి గుట్ట నుంచి బండమీదిపల్లి మీదుగా ఈ పాటు కాలువ ద్వారానే వరద నల్ల చెరువుకు వచ్చి చేరుతుంది. ఇప్పుడు ఈ కాలువను ధ్వంసం చేయడంతో వర్షాలు పడ్డ సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ముంపు సమస్య ఏర్పడే ప్రమాదముంది. ఈ ఆక్రమణలు రెవెన్యూ, సాగునీటి పారుదల శాఖ అధికారులకు తెలిసినా చర్యలు మాత్రం లేవు.
హద్దులు గుర్తించాల్సి ఉన్నా
సాధారణంగా ప్రతి చెరువుకు శిఖం, ఎఫ్‌టీఎల్ పరిధులు గుర్తించి పరిరక్షించాలి. 2016లో నల్ల చెరువును(Jadcherla Nalla cheruvu) సుందరీకరణ పనుల కోసం ప్రభుత్వం ఎంపిక చేసింది. రూ.3.98 కోట్ల అంచనాలతో రెండు గణేష్ ఘాట్లు, బతుకమ్మ ఘాట్‌ను నిర్మించి సుందరీకరణ పనులు చేపట్టారు. ఈ పనులు ప్రారంభం కాగానే ఈ చెరువు శిఖం ఎంత ఉంది? ఎఫ్‌టీఎల్ పరిధి ఎంత? బఫర్ జోన్ ఎక్కడి వరకు వస్తుంది? ఆయకట్టు ఉందా? తదితర వివరాలు సేకరించాలి. హద్దులు గుర్తించి కడీలు పాతాలి. కానీ ఇవేవీ జరగలేదు. ఈ ట్యాంకుబండ్‌ను రాష్ట్ర పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ ఈ ఏడాది ఏప్రిల్ 14న ప్రారంభించిన సందర్భంగానే చెరువు కబ్జా కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అయినా పరిస్థితిలో ఏ మార్పు లేదు.
రెవెన్యూ రికార్డుల ప్రకారం 20.15 ఎకరాలు చెరువు శిఖం ఉంది. నా సర్వీసులో పాటు కాలువలు మూసేసి కబ్జాలు చేసినట్లుగా గుర్తించలేదు. ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి నష్టాలు చేకూర్చే పనులను నేను ప్రోత్సహించను. ఒక వేళ కబ్జాలకు గురైనట్లు రికార్డుల్లో తేలితే.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. -లక్ష్మీ నారాయణ, జడ్చర్ల తహసీల్దార్
సర్వే చేశాం
జడ్చర్లలోని నల్లచెరువు(Jadcherla Nalla cheruvu) శిఖం, ఎఫ్‌టీఎల్ పరిధులపై సర్వే చేశామని.. హద్దుల విషయంలో రెవెన్యూ అధికారులకు నివేదిక సమర్పించామని జిల్లా సాగునీటి పారుదల శాఖ ఎస్ఈ శ్రీనివాసరావు పేర్కొన్నారు. సర్వే నంబర్లు, హద్దుల వివరాలు రెవెన్యూ శాఖతో కలిసి గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉందని చెప్పారు. పాటు కాలువల వివరాలు కూడా రెవెన్యూ శాఖ అధికారులతో మాట్లాడి కబ్జాలు కాకుండా చూస్తామని తెలిపారు.
ప్రత్యేక బృందం ఏర్పాటు చేస్తాం
జడ్చర్లలో ఎక్కడెక్కడ కబ్జాలు జరుగుతున్నాయో దానిపై దృష్టి సారిస్తామని అదనపు కలెక్టర్ సీతారామరావు చెప్పారు. నల్లచెరువు శిఖం, ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వీటితో పాటు జడ్చర్లలోని కొన్ని చోట్ల ప్రభుత్వ స్థలాలు కబ్జాలు అయినట్లు వినతులు వచ్చాయని.. వీటిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కబ్జాలు ఎక్కడెక్కడ జరిగాయో గుర్తించి వాటిని కాపాడుతామని వెల్లడించారు.
ఇదీ చదవండి: కాంగ్రెస్ ర్యాలీ నేపథ్యంలో దిల్‌సుఖ్‌నగర్‌లో ఉద్రిక్తత... దుకాణాలు మూసివేయించిన పోలీసులు