గంజాయి తరలింపులో నిందితులు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ నివ్వెర పరుస్తున్నారు. విశాఖపట్నం నుంచి తెలంగాణ, తమిళనాడు మీదుగా శ్రీలంకకు గంజాయిని తరలిస్తున్నారు. జీపీఎస్ ట్రాకర్లు ద్వారా... అధికారుల కళ్లు గప్పి కోట్లు సంపాదిస్తున్నారు. విశాఖ నుంచి గంజాయి తరలిస్తుండగా... మహబూబ్‌నగర్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదమే ముఠా గుట్టు రట్టు చేసింది. కారులో తరలిస్తున్న భారీ గంజాయిపై ప్రత్యేక బృందంతో విచారణ చేపట్టగా... అసలు విషయం బయటపడింది. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం తాటికొండ వద్ద ఆగి ఉన్న లారీని ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. అదే కారులో గంజాయిని గమనించిన లారీ డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించారు. గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో తమిళనాడుకు చెందిన ఐదుగురు వ్యక్తులు గంజాయిని రవాణా చేస్తున్నారని తేల్చారు.
గంజాయి అక్రమ రవాణా పథకాన్ని నిందితులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. విశాఖపట్నం సీలేరులో గంజాయిని కొని మధురై, రామేశ్వరం గుండా శ్రీలంకకు గంజాయి ప్యాకెట్లను తరలిస్తారు. రామేశ్వరం నుంచి శ్రీలంకకు గంజాయి తరలింపులో నిందితులు సాంకేతికతను వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి ప్యాకెట్లలో జీపీఎస్ ట్రాకర్‌లు ఉంచి పడవల ద్వారా తరలిస్తారు. శ్రీలంక సమీపానికి చేరగానే వాటిని నీళ్లలోకి వదిలేస్తారు. గంజాయి కేసులో సతీశ్, కళ్యాణ్, సురేంద్రన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని తెలిపారు.
ఇవీ చూడండి:దావోస్లో మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం