ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో.. జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉండటం వల్ల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు.
సాగర్‌కు స్వల్పంగా పెరిగిన వరద..
నాగార్జునసాగర్‌కు వరద ఉద్ధృతి స్వల్పంగా పెరిగింది. 19 వేల 741 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండగా... ఔట్ ఫ్లో వెయ్యి క్యూసెక్కులుగా ఉంది. 590 అడుగుల గరిష్ఠ సామర్థ్యానికి గానూ... 535.9 అడుగుల మేర నీరు ఉంది. 312.04 టీఎంసీల పూర్తి నీటి నిల్వకు గానూ ప్రస్తుతం... 179.89 టీఎంసీల మేర ఉంది. పులిచింతలకు ఈ సాయంత్రానికి ఇన్ ఫ్లో తగ్గింది. 13 వేల 140 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా... అంతే మొత్తంలో నీటిని దిగువకు పంపుతున్నారు. 45.77 టీఎంసీల సామర్థ్యానికి గానూ 43.59 శతకోటి ఘనపుటడుగుల నీరుంది. మూసీ ప్రాజెక్టుకు సైతం ఇన్ ఫ్లో తగ్గిపోయింది. 7 వేల 418 క్యూసెక్కులు వస్తుండగా... 4 గేట్ల ద్వారా 12 వేల 601 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. 4.46 టీఎంసీల గరిష్ఠ సామర్థ్యానికి గానూ మూసీ ప్రాజెక్టులో... 2.50 టీఎంసీల నీరుంది.
జూరాలకు పోటెత్తుతోన్న వరద...
జూరాలకు వరద పోటెత్తుతోంది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి భారీఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. 3 లక్షల క్యూసెక్కులకు పైగా దిగువకు వరద వస్తుండటంతో... కృష్ణా పరివాహక ప్రాంతాలన్నింటినీ అధికారులు అప్రమత్తం చేశారు. జూరాలకు ప్రస్తుతం లక్షా 66 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా.. 27 గేట్లు ఎత్తి లక్షా 68 వేల క్యూసెక్కులు దిగువకు విడదల చేస్తున్నారు. మరో 23 వేల క్యూసెక్కుల నీరు విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు విడుదల అవుతోంది. కుడి, ఎడమ, సమాంతర కాల్వలకు, కోయల్ సాగర్ జలాశయానికి నీటి విడుదల కొనసాగుతోంది. మొత్తం లక్షా 93వేల క్యూసెక్కుల నీరు జూరాల నుంచి బయటకు పోతోంది.
7 మిలియన్ యూనిట్ల విద్యుత్...
జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 1045 అడుగులు కాగా.. ప్రస్తుతం 1039 అడుగులు నీటి మట్టం కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 9.567 టీఎంసీలుగా.. ప్రస్తుతం 6.263 టీఎంసీల నీటి నిల్వను కొనసాగిస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదను అంచనా వేస్తూ జలాశాయాన్ని అధికారులు ఖాళీ చేస్తున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి రాత్రి వరకు వరద కొనసాగితే... రేపు ఉదయానికి సుమారు 40 గేట్లు ఎత్తే అవకాశం కనిపిస్తోంది. ఎగువ జూరాలలో 5 యూనిట్లు, దిగువ జూరాలో ఐదు యూనిట్ల ద్వారా 7 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను గడిచిన 24 గంటల్లో ఉత్పత్తి చేశారు.
అప్రమత్తంగా ఉండండి..
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికారులను కలెక్టర్ శృతి ఓఝా అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాలు, కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు.