మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఆంజనేయులు అనే వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. వర్షాకాలం ఆరంభం కావడం, తోటి రైతులంతా సాగు మొదలు పెట్టడం చూసి.. తాను కూడా తనకున్న రెండెకరాల భూమిలో సాగు చేద్దామనుకున్నాడు. విత్తనాలు, ఎరువులు ఇతర ఖర్చుల కోసం అప్పు కోసం ప్రయత్నించాడు.
ఎంత తిరిగినా ఆంజనేయులుకు అప్పు దొరకలేదు. దీనికి తోడు.. అంతకు ముందే కొన్ని అప్పులు కూడా ఉన్నాయి. అప్పు దొరకకపోవడం, పాత అప్పులు తీర్చలేకపోవడం వల్ల మనస్తాపం చెంది.. వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మృతుడి భార్య జయమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై లెనిన్ తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక వేరే కారణాలున్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి: 'యూ ఫర్ అగ్లీ' అని నేర్పిన టీచర్లు.. సస్పెండ్!