ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో లాక్‌డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉదయం 10 గంటలకే అన్ని దుకాణాలు మూసేసి.. వ్యాపారులు ఇళ్లకు చేరుకున్నారు. తొలిరోజు కావడం వల్ల ఉదయం 11 గంటల వరకూ జనం రద్దీ కనిపించింది. అనంతరం రహదారులు క్రమంగా నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర, మినహాయింపు ఇచ్చిన రంగాల వ్యక్తులు తప్ప రోడ్లపై జనం కనిపించలేదు. మహబూబ్‌నగర్ పట్టణంలో లాక్‌డౌన్ పరిస్థితిని ఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు.
జనాన్ని ఇబ్బంది పెట్టేందుకు లాక్‌డౌన్ విధించలేదని.. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకే అమలుచేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు సహకరించాలని కోరారు. ఐదు జిల్లాల సరిహద్దుల వద్ద పోలీస్ చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
నారాయణపేట జిల్లాలో జలాల్పూర్, వాసవీనగర్, కానుకుర్తి, ఎక్లాస్పూర్, చేగుంటలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో పుల్లూర్, నందిన్నె వద్ద చెక్ పోస్టులు పెట్టారు. పుల్లూరు టోల్‌ప్లాజా నుంచి తెలంగాణ జిల్లా వైపు వచ్చే వాహనాలకు ఎలాంటి ఆంక్షలు అమలు చేయడం లేదు. ఇతర ప్రాంతాల నుంచి బస్సుల ద్వారా సొంత జిల్లాలకు చేరుకున్న వారు గమ్య స్థానాలకు చేరుకునేందుకు ఇబ్బందిపడుతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత బస్సులు లేకపోవడంతో కొందరు కాలినడకనే గ్రామాలకు బయలు దేరారు.
ఇవీచూడండి: తెలంగాణకు తాళం.. కొనసాగుతున్న లాక్‌డౌన్