ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన పోతిరెడ్డిపాడు 203 జీవోను వ్యతిరేకిస్తున్నట్లు పాలమూరు ప్రగతి ఫోరం జిల్లా కన్వీనర్ హర్షవర్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయాన్ని మేధావులకు, ప్రజలకు తెలియజేయడానికి ‘కృష్ణానదీ జలసాధన దీక్ష’ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇతర పార్టీలు, నేతలు ప్రజా భాగస్వామ్యంతో ఉద్యమం నిర్మించడం లేదని విమర్శించారు.
ఎత్తిపోతల పథకం చేపట్టి ఎగువ ప్రాంతంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో రిజర్వాయర్లు నిర్మించి భూములకు నీరందించాలని కోరారు. రోజుకు 5 నుంచి 6 టీఎంసీల చొప్పున వరద నీటిని 35 రోజులపాటు ఎత్తిపోస్తే ఉమ్మడి జిల్లాతోపాటు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు కూడా కాలువలు, చెరువుల ద్వారా నీరందుతుందని పేర్కొన్నారు. జిల్లాలో చేపట్టిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి... వాటి కింద ఉన్న ఆయకట్టును స్థిరీకరించి.. కాలువలను ఆధునీకరిస్తే గ్రావిటీ ద్వారా నీళ్లందించేందుకు ఆస్కారముంటుందన్నారు.