Dharani Portal Irregularities : భూరికార్డుల నిర్వహణ, రిజిస్ట్రేషన్‌లో అక్రమాలు, అవినీతికి తావులేకుండా ధరణి పోర్టల్ పనిచేస్తోందని ప్రభుత్వం చెబుతున్నా... కొన్నిచోట్ల ఇదే అక్రమార్కులకు వరంగా మారుతోంది. నకిలీ దస్త్రాలు సృష్టించి ఎకరాల కొద్ది భూముల్ని ఎవరికీ తెలియకుండా కాజేస్తూ... అక్రమంగా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూరు రెవిన్యూ మండల పరిధిలో ఇదే తరహా ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
Dharani Portal Issues : బోయిన్‌పల్లి గ్రామానికి చెందిన విజయలక్ష్మికి ఊట్కూరు మండలం దంతనపల్లి శివారులోని సర్వే నెంబర్ 24లో 11.21 ఎకరాల భూమి ఉంది. దాన్ని విజయవాడకు చెందిన జమాల్ 2013లో కొనుగోలు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ధరణి రికార్డుల్లో ఆ భూములు జమాల్ పేరు మీదే ఉన్నా... ఆధార్ అనుసంధానం చేయని జాబితాలో ఉండిపోయాయి. ఈ విషయాన్ని గుర్తించిన కొందరు రియల్టర్లు, భూముల్ని కాజేసేందుకు రెవిన్యూ సిబ్బందితో కుమ్మక్కయ్యారు. ఊట్కూరు గ్రామానికి చెందిన జలాల్ అనే వ్యక్తిని అందుకోసం ఎంచుకున్నారు. అతని పేరును ఆధార్‌లో జమాల్‌గా మార్చి.. అదే అధార్‌ను ధరణి రికార్డుల్లో సర్వే నంబర్ 24లోని 11.21 ఎకరాల భూములకు అనుసంధానం చేశారు. దీంతో ఆ భూములు ఊట్కూరు మండలానికి చెందిన జమాల్ అలియాస్ జలాల్ పేరు మీదకు మారిపోయాయి.
2నెలల తర్వాత అవే భూముల్ని శివకుమార్ అనే వ్యక్తి పేరున రిజిస్ట్రేషన్ చేయించారు. అందుకోసం జలాల్‌ను సాక్షి సంతకం పెట్టాల్సిందిగా పిలువగా... ఆయన సంతకంతో రిజిస్ట్రేషన్ పూర్తైంది. గతేడాది డిసెంబర్‌లో శివకుమార్.... రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం నర్సప్పగూడకు చెందిన నీరటి మల్లయ్య పేరిట ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే ఈ భూములు ఎవరివి అన్న విషయం జలాల్, శివకుమార్, మల్లయ్యకు కూడా తెలియకపోవడం గమనార్హం. వారికి విషయం తెలియకుండా రిజిస్ట్రేషన్ పూర్తి చేయించడంతో అక్రమార్కులకు రెవిన్యూ సిబ్బంది సహకరించారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఆ మండల తహసీల్దార్‌కు ఏపీ సీఐడీ విభాగం లేఖ: రియాల్టర్లు, రెవెన్యూ అధికారుల మధ్య గుట్టుగా సాగిన ఈ అక్రమ వ్యవహారం.. ఊట్కూరు తహసీల్దార్‌కు ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం లేఖ రాయడంతో బట్టబయలైంది. ఊట్కూరు మండలంలో అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన 188.50 ఎకరాల భూములున్నాయని, వాటి ప్రభుత్వ విలువ, మార్కెట్ విలువను కోర్టు సమర్పించాలని, ఆ వివరాలు పంపాల్సిందిగా కర్నూల్ సీఐడీ పోలీసులు ఊట్కూరు తహశీల్దార్‌కు లేఖ రాశారు. అందులో 24వ సర్వే నెంబర్‌లోని జమాల్ చెందిన 11.21 ఎకరాల భూములు కూడా ఉన్నాయి. వీటిపై క్రయవిక్రయాలు జరిగినట్లుగా గుర్తించిన తహశీల్దార్... జరిగిన రిజిస్ట్రేషన్లపై జిల్లా కలెక్టర్‌కు విన్నవించారు. అవే కాకుండా లక్ష్మిపల్లి శివారులో అగ్రిగోల్డుకు సంబంధించిన 4 ఎకరాల భూమి ఇతరుల పేరు మీదకు బదిలీ అయినట్లుగా గుర్తించినట్లు తహశీల్దార్ తిరుపతయ్య తెలిపారు.
ధరణి రికార్డుల్లో వివరాలు ఉన్నాయి.. కానీ..: తెలంగాణ ఏర్పాటుకు ముందే అగ్రిగోల్డ్ సంస్థ ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలాచోట్ల భూములను కొనుగోలు చేసింది. భూరికార్డుల ప్రక్షాళన అనంతరం ధరణి రికార్డుల్లో వాటి వివరాలు నమోదై ఉన్నా... ఆధార్ అనుసంధానం కాలేదు. దీన్ని ఆసరాగా చేసుకుని చాలా చోట్ల అక్రమార్కులు ఆ భూముల్ని కాజేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఊట్కూరు మండలంలో ఉన్నవి 188 ఎకరాలే అయినా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 480 ఎకరాలకు పైగా భూములు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భూములపై జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
ఇవీ చదవండి: