73 ఏళ్లుగా క్రమం తప్పకుండా ప్రతీ బుధవారం నిర్వహిస్తున్న మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర సంత ఇప్పుడు లాక్డౌన్ కారణంగా జరగట్లేదు. 8 వారాలుగా సంత నిర్వాహణ లేక... ఇంకెప్పుడు నిర్వహిస్తారో తెలియక సంత మీదే ఆధారపడి జీవించే స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
దేవరకద్రకు చెందిన బలుసుపల్లి పెద్ద బుచ్చారెడ్డి... 1947 ఏప్రిల్ 30న పశువుల సంతను ప్రారంభించారు. సంత అభివృద్ధి జరిగిన అనంతరం నిర్వహణ బాధ్యతలను గ్రామపంచాయతీకి అప్పగించారు. 73 ఏళ్లుగా ప్రతి బుధవారం నడుస్తున్న ఈ సంత.. వివిధ సందర్భాల్లో ఒక్క వారం మినహా.. వరుసగా ఎప్పుడు 2 వారాల పాటు నిర్వహణ ఆగలేదు. అలాంటిది కరోనా కట్టడిలో భాగంగా ఏప్రిల్ ఒకటి నుంచి ఇప్పటివరకు వరసగా ఎనిమిది వారాలు సంత జరగలేదు. భవిష్యత్తులో ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయము ఇప్పటికీ సమాచారం లేదు.
వారానికి సగటున రూ. లక్ష ఆదాయం
దేవరకద్రలో ప్రతి బుధవారం నిర్వహించనున్న సంత వల్ల సగటున రూ. లక్ష వరకు ఆదాయం వస్తుండేది. అలా నెలకు రూ. 4 లక్షల నుంచి ఐదు లక్షల వరకు గ్రామపంచాయతీకి ఆదాయం సమకూరేది. అలాంటిది ఎనిమిది వారాలుగా నిర్వాహణ లేక రూ.8 లక్షలను గ్రామపంచాయితీ నష్టపోయినట్లు అయింది.
సిబ్బందికి వేతనాల రూపంలో మూడున్నర లక్షలు
పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న 39 మంది సిబ్బందికి వేతనాలుగా... సుమారు మూడున్నర లక్షలు చెల్లిస్తున్నారు. సంత నిర్వహణ చేయకుంటే మేజర్ పంచాయతీలో పనిచేసే సిబ్బంది వేతనాలు చెల్లించడం గ్రామపంచాయతీకి ఆర్థిక భారం కానుంది.