మహబూబ్నగర్లో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి కలెక్టర్ వెంకట్రావు హాజరయ్యారు. ఈనెల 31 వరకు జరిగే లాక్డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు పరిచేలా చొరవ చూపాలని ఆయన అన్నారు. మాస్కులు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం తప్పనిసరి అని గుర్తు చేశారు. వైద్యారోగ్యశాఖ చేపట్టిన చర్యలను డీఎంహెచ్ఓ కృష్ణ సభ్యులకు వివరించారు. సుమారు 10 వేల మంది ఇతర రాష్ట్రాల నుంచి పాలమూరు జిల్లాకు వచ్చారన్నారు. కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఏ పంటలు వేయాలో సూచిస్తాం
ఖరీఫ్ ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలోనే రైతులు ఏ పంటలు వేయాలని సూచిస్తామని వ్యవసాయశాఖ అధికారులు సభ్యులకు తెలిపారు. ఎరువులు, విత్తనాల సరఫరాలో సభ్యులు చేసిన సూచనలను తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామన్నారు. ప్రభుత్వ నిర్ణయంపైనే తదుపరి కార్యాచరణ ఆధారపడి ఉంటుందన్నారు. ఉద్యానపంటల వివరాల్ని ఆ శాఖ ఉప సంచాలకులు సాయిబాబా సభ్యులకు వివరించారు.
రైతులు ఇబ్బందులు పడకుండా..
ఉద్యానశాఖ అధికారులు జిల్లాలో ఏ ప్రాంతాలకు వచ్చినా ముందస్తుగా సమాచారం ఇస్తే.. అక్కడి సమస్యలను అధికారులకు వివరించే ప్రయత్నం చేస్తామని సభ్యులు సూచించారు. హరితహారం, ఉపాధి హామీ సహా ఇతర అంశాలపైనా సభ్యులు చర్చించారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలని స్వర్ణ సుధాకర్ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో మంచినీరు, విద్యుత్ సహా ఇతర సమస్యలు లేకుండా చేయాలన్నారు. కోవిడ్-19 నియంత్రణలో వైద్యారోగ్యశాఖ, రెవిన్యూ, పోలీసు, పంచాయతీ రాజ్ సహా అన్ని శాఖల అధికారులు బాగా పనిచేశారని ఆమె అభినందనలు తెలిపారు.
ఇదీ చూడండి : రోడ్డుపైనే కాదు.. కాన్వాస్పైనా గీస్తూ అవగాహన