మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తాళ్ల ఊకల్ గ్రామానికి చెందిన కొందరు రైతులు మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆందోళనకి దిగారు. ఎమ్మార్వో, వీఆర్వోలు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గ్రామానికి చెందిన రైతు వీరబోయిన ఐలయ్య సాదాబైనామా కింద పట్టాదారు పాసుపుస్తకానికి దరఖాస్తు చేసుకొని సంవత్సరమైంది. ఇప్పటికీ పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెప్పుడిస్తారంటూ గ్రామ వీఆర్వోపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్యాలయంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో అధికారులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా రైతులు వినకపోవడం వల్ల బలవంతంగా వారిని బయటకు పంపించారు. ప్రస్తుతం విచారణ చేస్తున్నామని.. నిబంధనల ప్రకారం పట్టాదారు పాసుపుస్తకం జారీ చేస్తామని తహసీల్దార్ సైదులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: చచ్చిపోతారని భయపెట్టారు... ఆదివాసీలను దోచేశారు!