మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డ గ్రామంలోని వేములపల్లి రాజు కుటుంబం వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఆ ఇంట్లో మంటలు చెలరేగి టీవీ, మొబైల్ ఫోన్, సెల్ఫ్లో చెద్దర్లు కాలిపోయాయి. మంటలను గమనించిన ఇంట్లోని వారు వెంటనే మంటలను ఆర్పివేశారు. రెండవ రోజు కిచెన్లో, వరండాలోని ఫ్రిజ్పైన ఉన్న దుస్తులు కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ తో కాలిపోతున్నాయని వారు భావించారు. వెంటనే ఇంట్లోని వస్తువులన్నీ ఆరుబయట రేకుల గుడిసెలో ఉంచారు. మూడవరోజు రేకుల గుడిసెలోని ఓ బ్యాగులో, స్నానాల గదిలో విడిచిన బట్టలలో మంటలు చెలరేగి బట్టలు కాలిపోయాయి. స్నానాల గదికి విద్యుత్ సరఫరా కూడా లేదు మరి ఎలా కాలిపోయాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాలుగవ రోజు వంట గదిలో తలుపుకు తగిలించిన ఉల్లిగడ్డల కవరులో, ఇంటి ముందు కొట్టం పైన ఉన్న తాటాకులపై మంటలు వచ్చి కాలిపోతుండగా.. మంటలను గమనించిన వారు వెంటనే మంటలను ఆర్పివేశారు. దీనితో ఆ ఇంటి వారంతా చెట్టు కిందే ఉంటూ మంటలు ఎలా వస్తున్నాయో తెలియక క్షణం... క్షణం భయం భయంగా గడుపుతున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల బయ్యారం ఎస్సై రమాదేవి ఆ ఇంటిని సందర్శించి క్షుణ్ణంగా పరిశీలించి విచారణ చేపట్టారు. ఈ విషయంపై ఆ ఇంటి వారు మాట్లాడుతూ.... ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల మధ్య ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, ఇలాంటి సంఘటనలను ఎప్పుడూ చూడలేదని.. తమ ఇంట్లోనే ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావడం లేదని, ఏం చేయాలో పాలుపోవడం లేదని వాపోయారు.
ఇవీ చదవండి...విశాఖ వాసులను వెంటాడుతున్న విషవాయువు...!