మహబూబాబాద్ జిల్లాలో రేపు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రిని పంపిణీ చేశారు. ఈ ప్రక్రియను కలెక్టర్ గౌతమ్, ఎస్పీ కోటిరెడ్డి పరిశీలించారు. పోలింగ్ అధికారులు, సామగ్రి తరలింపు కోసం పల్లె వెలుగు బస్సులు ఉపయోగిస్తున్నారు. వీటికి జీపీఎస్ అనుసంధానించారు.
కరోనా నేపథ్యంలో పోలింగ్ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్స్ పంపిణీ చేశారు. ఓటర్లు మాస్కులు ధరించి పోలింగ్ కేంద్రాలకు రావాలని విజ్ఞప్తి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.
పటిష్ఠ ఏర్పాట్లు...
జిల్లాలో మొత్తం 36,633 ఓటర్లు ఉండగా... 53 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. 338 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని చెప్పారు. 20 పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్ కాస్టింగ్, మిగతా 33 కేంద్రాల్లో వీడియో చిత్రీకరణ కోసం ఏర్పాట్లను చేసినట్లు వివరించారు. బందోబస్తులో 480 మంది పోలీసులు పాల్గొననున్నారని వెల్లడించారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలి: ఉత్తమ్