ఈ నెల 8న జరగబోయే భారత్ బంద్‌ను విజయవంతం చేసి రైతులకు అండగా నిలబడాలని మంత్రి సత్యవతి రాఠోడ్.. ప్రజలను, వ్యాపార, వాణిజ్య వర్గాలను కోరారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్‌తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. రేపటి భారత్ బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో తెరాసా శ్రేణులు రోడ్డెక్కి రైతులకు అండగా నిలబడాలన్నారు. తాము జిల్లా కేంద్రంలోని 365 జాతీయ రహదారిపై బంద్‌లో పాల్గొంటామని మంత్రి చెప్పారు.
కేంద్రం.. రైతు వ్యతిరేకం
వారం రోజులుగా అన్నం పెట్టే రైతులు దేశ రాజధాని దిల్లీలో చలికి, వానకు, ఎండకు ఇబ్బందులు పడుతూ పోరాటం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. మొదటి నుంచి భాజాపా ప్రభుత్వం వ్యాపారస్థులు, ఉన్నత వర్గాలకు కొమ్ము కాసేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. రైతులు ఎక్కడైనా పంటను అమ్ముకోవచ్చనే సిద్ధాంతం కేవలం వ్యాపారులు, దళారులకే ఉపయోగపడుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్.. రైతుల కోసం పథకాలు ప్రవేశపెడితే కేంద్రం మాత్రం రైతు వ్యతిరేక చట్టాలను చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా ఈ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని కోరారు. రేపటి బంద్‌కు తెరాసా శ్రేణులు టాక్టర్లు, ఎడ్ల బండ్లపై కదిలి రావాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీం కీలక తీర్పు