విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గౌతమ్ సూచించారు. జిల్లాలోని నర్సింహులపేట మండలంలో పర్యటించిన ఆయన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసి విద్యార్థులకు పాఠాలు బోధించారు. వారి సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసం, పట్టుదలతో చదివి మంచి మార్కులు సాధించాలన్నారు.
అనంతరం నర్సింహులపేట, జయపురం గ్రామాల్లోని పల్లె ప్రగతి పనులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని చేపట్టాలని సూచించారు. పెండింగ్ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు భూక్యా సంగీత, సర్పంచి రజిత, అధికారులు పాల్గొన్నారు.