తన భూమిని వేరే వారికి అక్రమంగా పట్టా చేశారని ఆరోపిస్తూ మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటలో ఓ రైతు వినూత్నంగా నిరసన తెలిపాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం పైకెక్కి మెడకు ఉరి తాడు బిగించుకుని ఆందోళనకు దిగాడు. నర్సింహులపేట మండలం పడమటి గూడెం గ్రామానికి చెందిన బుద్దె నాగలక్ష్మి అనే రైతుకు 11.33 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని నాగలక్ష్మి మామ గారైన బుద్దె సోమయ్య అదే గ్రామానికి చెందిన ఒకరి వద్ద 1972లో కొనుగోలు చేశారు. అనంతరం సోమయ్య మృతిచెందగా... ఆ భూమిని 2012వ సంవత్సరంలో నాగలక్ష్మి పేరున పట్టా చేయించారు. పట్టాదారు పుస్తకం బ్యాంకులో పెట్టి వ్యవసాయ రుణం కూడా పొందారు. రైతు బంధు పథకం ద్వారా మొదటి విడతలో సుమారు రూ.45 వేల డబ్బులు కూడా పొందారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన అమ్మకందారు కుమారుడు తన తండ్రి భూమిని విక్రయించలేదని ఆరోపిస్తూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంతో తహసీల్దార్ తనకు సంబంధించిన భూమిని వేరే రైతు పేరుపై పట్టా చేసి పాసుపుస్తకం జారీ చేశారని ఆరోపించారు. తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ బాధిత రైతు నాగలక్ష్మి, ఆమె భర్త భిక్షపతి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. తహసీల్దార్ కార్యాలయం పైకెక్కి చెట్టుకు తాడు వేసి మెడకు బిగించుకొని వినూత్న నిరసనకు దిగారు. తనకు సంబంధించిన భూమిని ఇతరులకు అక్రమంగా ఎలా చేస్తారని ఆరోపిస్తూ తనకు న్యాయం జరిగే వరకు ఇలాగే ఉంటానని భీష్మించుకు కూర్చున్నారు. బాధిత రైతుతో తొర్రూరు ఆర్డీఓ ఈశ్వరయ్య ఫోన్లో మాట్లాడి పట్టా చేసిన భూమిని హోల్డ్‌లో పెడుతున్నట్లు హామీ ఇవ్వడంతో ఆయన ఆందోళన విరమించారు.
ఇవీ చూడండి: సీఎం ఫాంహౌస్‌లో తుపాకీతో కాల్చుకుని హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య