Swarkheda Govt school Headmaster : ఒక గురువు శ్రద్ధగా, పట్టుదలగా పనిచేస్తూ.. విధుల్లో అంకిత భావం కనబరిస్తే ఒక పాఠశాలనే కాకుండా ఒక గ్రామాన్నే మార్చవచ్చని నిరూపించారు ప్రధానోపాధ్యాయుడు కేడర్ల రంగయ్య. కుమురం భీమ్ జిల్లా కెరమెరి మండలం సావర్ ఖేడ ప్రభుత్వ పాఠశాలలో 2013 లో ప్రధానోపాధ్యాయుడు బాధ్యతలు స్వీకరించారు కేడర్ల రంగయ్య. అప్పటి నుంచి పాఠశాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడ్డారు. గ్రామస్థుల నమ్మకాన్ని పొంది... 50 ఉన్న విద్యార్థుల సంఖ్యను 260 కి చేర్చారు. ఇప్పుడు ఈ సావర్ ఖేడ గ్రామంలోని పిల్లలు ఎక్కువ శాతం మంది ఈ పాఠశాల విద్యార్థులే. ప్రస్తుతం సావర్ ఖేడ ప్రభుత్వ బడి.. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా నిలుస్తోంది.
కుటుంబంతో సహా ఊరికి..
National Best Teacher : గ్రామాల్లోని పాఠశాలలకు బదిలీ అయితే.. చాలా మంది టీచర్లు జిల్లా కేంద్రాల్లో ఉంటూ అక్కడి నుంచి పాఠశాలలకు వస్తుంటారు. పనిచేసే ప్రదేశానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉండాలన్న నిబంధనను చాలా మంది బేఖాతరు చేస్తూ... ఊరికి దూరంగా జిల్లా కేంద్రాల్లో నివాసముంటారు. వారు ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్నా... వారి పిల్లలను మాత్రం ప్రైవేటు పాఠశాలల్లోనే చదివిస్తుంటారు. కానీ రంగయ్య.. తనకు సావర్ ఖేడకు బదిలీ కాగానే... తన కుటుంబాన్ని అదే గ్రామానికి తీసుకువచ్చారు. తన ఇద్దరు పిల్లలను తాను పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలలో చేర్చించారు. తన భార్య సాయం తీసుకుని పాఠశాలను క్రమక్రమంగా తీర్చిదిద్దారు. ఈ చర్యతో గ్రామస్థుల్లో రంగయ్య పట్ల నమ్మకం ఏర్పడింది. మంచి విద్య అందిస్తారని భావించి క్రమంగా తమ పిల్లలను ప్రభుత్వ బడికి పంపడం మొదలుపెట్టారు. అంతేకాకుండా స్కూల్ అభివృద్ధి కోసం సుమారు రూ.6 లక్షల రూపాయలు పోగు చేసి ఇచ్చారు.
క్రమంగా అభివృద్ధి
గ్రామస్థుల సహకారం సావర్ ఖేడ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. పిల్లలకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రతి ఒక్కరూ పాటు పడ్డారు. దాదాపు 100 మంది విద్యార్థులు గురుకులాల్లో ప్రవేశాలు పొందారు. గ్రామస్థులు చేసిన ఆర్థిక సాయంతో ప్రొజెక్టర్, టీవీలు, కుర్చీలు, అదనపు గదులు తదితర వసతులు కల్పించామని ప్రధానోపాధ్యాయుడు రంగయ్య తెలిపారు.
11ఏళ్ల క్రితం నా పని మొదలుపెట్టాను. ఈ రోజు ఈ స్థాయికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడు 50 మంది విద్యార్థులు ఉన్న స్కూళ్లో ఇప్పుడు 260 మంది ఉన్నారు. నా కుటుంబంతో పాటు ఈ ఊరికి వచ్చాను. నా పిల్లలను కూడా ఇదే స్కూళ్లో చేర్పించాను. గ్రామస్థులు కూడా తర్వాత సహకరించారు. అలా సమష్టి కృషితో పాఠశాల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని నిరూపించాం.
-కేడర్ల రంగయ్య, ప్రధానోపాధ్యాయుడు
ప్రత్యేక బోధనాపద్ధతులు
కరోనా లాక్‌డౌన్ కారణంగా పాఠశాలలు మూతపడ్డా.... విద్యార్థులకు విద్య దూరం కాకుండా చూశారు రంగయ్య. ఎఫ్ఎం సావర్ ఖేడ, సూపర్ హండ్రెడ్, ది విలేజ్ వాల్ పేపర్స్, ఫార్ములా అఫ్ చతుర్భుజ, షేర్ ఇట్ వంటి ప్రత్యేక బోధనా పద్ధతుల ద్వారా విద్యార్థులకు పాఠాలు నేర్పించామని చెబుతున్నారు రంగయ్య.
కరోనా సమయంలో ప్రత్యేక బోధనాపద్ధతుల ద్వారా తరగతులు చేర్పించాం. వందమంది విద్యార్థులను సూపర్ హండ్రెడ్ పేరుతో పిల్లలను టీచర్లుగా మార్చాం. ఎఫ్ఎం, షేర్ ఇట్ సహకారంతో పాఠాలు బోధించాం. తద్వారా మంచి ఫలితాలు వచ్చాయి.
కేడర్ల రంగయ్య, ప్రధానోపాధ్యాయుడు
సమష్టి కృషితో అభివృద్ధి
పాఠశాల ప్రగతికి పాటుపడిన రంగయ్య... సామాజిక అంశాలపైనా తన గళం విప్పారు. పదో తరగతి కాగానే.. ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేయడం చూసి.. బాల్య వివాహాలను ఆపేలా కృషి చేశారు. దీక్షలూ చేపట్టారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వారికి వివరించారు. రంగయ్య చేసిన అవగాహన కొందరిలో మార్పు తీసుకువచ్చింది. పదో తరగతి కాగానే... పెళ్లిళ్లు చేయకుండా.. ఉన్నత చదువులకు పంపడం మొదలుపెట్టారు. గొలుసు దుకాణాలకు వ్యతిరేకంగానూ నిలబడ్డారు రంగయ్య. గొలుసు దుకాణాలు మూసివేయాలంటూ గ్రామంలో పది రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. ప్రధానోపాధ్యాయుడు రంగయ్య చర్యలతో గ్రామస్థుల్లో మార్పు వచ్చింది. మద్య నిషేధానికి, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సమష్టి నిర్ణయం తీసుకున్నారు. రంగయ్య కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం... గతేడాది సెప్టెంబర్‌లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారంతో సత్కరించింది.
ఇదీ చదవండి: BEST TEACHER: బొమ్మల టీచరమ్మ.. బోధిస్తే భలే అర్థమవుతుంది!