కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం అందేవెళ్లి గ్రామానికి చెందిన అనిశెట్టి వెంకటేష్ మూడు రోజుల క్రితం తన పత్తి చేనులో మందు కొట్టాడు. రసాయనాల ప్రభావం వల్ల అనారోగ్యానికి గురయ్యాడు. శుక్రవారం సాయంత్రం కాగజ్ నగర్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అర్ధరాత్రి సమయంలో వెంకటేష్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించిన అతని సోదరుడు నర్సుల వద్దకు వెళ్లాడు.
అయినప్పటికీ వారు సరిగ్గా స్పందించలేదని ఆరోపిస్తున్నాడు. ఉదయం 5 గంటల సమయంలో వెంకటేష్ మృతి చెందాడు. సరైన సమయంలో చికిత్స చేయకపోవడం వల్లే తన సోదరుడు మృతి చెందాడని ఆరోపిస్తూ... బంధువులతో ఆస్పత్రి ఎదుట ఆందోళనకి దిగాడు. వెంకటేష్ మృతికి వైద్యుల నిర్లక్షమే కారణమని ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేశారు.
ఇవీ చూడండి: తెలంగాణలో కొత్తగా 2,256 కరోనా కేసులు, 14 మరణాలు