లాక్‌డౌన్ కారణంగా ప్రభుత్వ బడులన్నీ మూసి ఉన్నాయి. అసంపూర్తి భవనాలను పూర్తి చేయడం, మరుగుదొడ్లు, శౌచశాలలు, వంటగదులు ప్రహరీలు లేనిచోట వీటిని నిర్మించడానికి నిధులు మంజూరయ్యాయి. పనులు నత్తకు నడకలు నేర్పినట్లు సాగుతున్నాయి. కొన్నిచోట్ల అసలు ప్రారంభమే కాలేదు. కరోనా తీవ్రత తగ్గి ఈ ఏడాది పాఠశాలలు పునఃప్రారంభమైతే విద్యార్థులకు పాతసమస్యలే ఎదురు కానున్నాయి. ఈ సెలవుల్లోనే పనులను వేగంగా పూర్తి చేస్తేనే ప్రయోజనం ఉంటుందని విద్యార్థుల పోషకులు అంటున్నారు.
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని 55 జడ్పీ పాఠశాలలకు రూ.1.50 కోట్లతో సైన్స్ ల్యాబ్ పరికరాలను 2018లోనే అందించారు. వీటిని తరగతి గదుల్లోనే ఉంచారు. వీటికోసం కొత్తగా సైన్స్ ల్యాబ్‌లను నిర్మిస్తున్నారు. జిల్లాలో ఎక్కడా ఇవి పూర్తికాలేదు. విద్యార్థుల తాగునీటి ఇబ్బందులను తీర్చడానికి ప్రతీ పాఠశాలకు ‘భగీరథ’ పైప్‌లైన్ అనుసంధానించి, సంప్, మోటారు ఏర్పాటు చేయనున్నారు. ఇవీ ఎక్కడా చేయలేదు. మరుగుదొడ్లు, వంటశాలలు ఏళ్ల తరబడి అసంపూర్తిగానే ఉన్నాయి. పిల్లలు ఒంటికి, రెంటికి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
పనులు పూర్తిచేసేలా చూస్తాం
- వెంకటేశ్వర్లు, ఇన్‌ఛార్జి డీఈఓ
పాఠశాలల్లో అదనపు గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం తదితర సౌకర్యాలను కల్పిస్తాం. నిధులూ విడుదలయ్యాయి. సత్వరమే పనులు జరిగేలా చర్యలు తీసుకుంటాం.
కాగజ్‌నగర్ మండలంలోని జంబుగ ప్రాథమిక పాఠశాల భవనమిది. చినుకుపడితే విద్యార్థులందరూ గొడుగులతో పాఠశాలకు రావాల్సిందే. వర్షం వస్తే బడి పూర్తిగా కురుస్తూనే ఉంటుంది. మరమ్మతులు చేయకపోతే వానాకాలం పూర్తిగా ఈ పాఠశాలకు సెలవులేనని గ్రామస్థులు అంటున్నారు.
ఊట్‌సారంగపల్లి ప్రాథమిక పాఠశాల భవనం ఇది. 42 మంది పిల్లలు చదువుకుంటున్నారు. స్లాబు పెచ్చులు ఊడి ఇనుపచువ్వలు కనిపిస్తున్నాయి. బడులు తెరిచేలోగా కనీస మరమ్మతులైనా చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
జిల్లా కేంద్రంలోని జడ్పీ పాఠశాల భవనమిది. ఆవరణ దిగువకు ఉండటం వల్ల చిన్నపాటి వర్షం వచ్చినా పాఠశాల ముందు చెరువును తలపిస్తుంది. తరగతి గదుల్లోకీ నీళ్లు వెళ్తాయి. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ముందే ఈ పాఠశాల ఉండడం గమనార్హం.
ఇదీ చదవండి: 'ఈ నెల 10లోపు ధరణిలో చేరిన రైతులకు నగదు జమ'