నకిలీ విత్తనాలు, నాసిరంకం పురుగు మందులు రైతులకు అమ్మేవారిపై కఠిన చర్యలు చేపడతామని రామగుండం కమిషనర్ కుమురం భీం జిల్లా ఇంఛార్జీ ఎస్పీ సత్యనారాయణ హెచ్చరించారు. దహేగం మండలం కేంద్రంలో నిషేధిత పత్తి విత్తనాల దందాపై విశ్వసనీయ సమాచారం మేరకు... టాస్క్ఫోర్స్, స్థానిక పోలీసులు, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా సోదాలు చేపట్టారు.
ఈ దాడుల్లో సుమారు రూ.8 లక్షల విలువగల 4 క్వింటాళ్ల నిషేధిత పత్తి విత్తనాలు లభ్యమైనట్లు తెలిపారు. మండల కేంద్రానికి చెందిన అబ్దుల్ రషీద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా.. ఏపీలోని గుంటూరుకు చెందిన వ్యక్తి నుంచి విత్తనాలను తీసుకొచ్చినట్లు కమిషనర్ వెల్లడించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
నకిలీ విత్తనాలు, నిషేధిత పురుగు మందులు అమ్మితే పీడీ యాక్టులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కుమురం భీం జిల్లా అదనపు ఎస్పీ వైవిఎస్ సుధీంద్ర, అసిఫాబాద్ డీఎస్పీ అచ్చెశ్వర్ రావు, జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చుడండి: యంగిస్తాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు కరోనా కిట్ల అందజేత