కరోనా కాలంలో అన్నార్తులకు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆపన్న హస్తం అందించారు. మహమ్మారి సోకి ఇబ్బంది పడుతున్న బాధితులకు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోజూ సుమారు 800 ఆహార పొట్లాలను అందజేస్తున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ డివిజన్ పరిధిలో కరోనా కేసుల సంఖ్య పెరగడంతో పాటు లాక్డౌన్ వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆయన నివాసంలోనే వంటలు చేస్తుండగా... కోనేరు యువసేన సభ్యులు పంపిణీ చేస్తున్నారు. కాగజ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రస్తుతం 300 మంది కొవిడ్ చికిత్స పొందుతున్నారు. వారితో పాటు బాధితుల కుటుంబ సభ్యులు, మరికొంతమంది ఇంటివద్ద చికిత్స పొందుతున్నారు. వారందరికీ రోజూ రెండుపూటలా భోజనం పంపిస్తున్నారు.
కరోనా సోకిన బాధితులు తమకు భోజనం కావాలని ఫోన్ చేస్తే చాలు... సమయానికి అందజేసేలా ఏర్పాట్లు చేశారు. పౌష్టికాహారం కోసం భోజనంలో అన్నం, పప్పు, కోడిగుడ్డు, పచ్చడి, అరటిపండు, నీళ్ల బాటిల్, ఇస్తున్నారు. దాతల సహకారంతో డ్రై ఫ్రూట్స్‌ను అందించారు. రోజూ ఉదయం 8గంటల నుంచి ఎమ్మెల్యే సతీమణి రమాదేవి దగ్గరుండి వంటలు చేయిస్తున్నారు. భోజనం మాత్రమే కాకుండా అవసరమైన వారికి గ్యాస్ సిలిండర్ అందజేస్తామని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలకు ఎంత చేసినా తక్కువేనని ఎమ్మెల్యే అన్నారు. ఈ ఆపత్కాలంలో ఎటువంటి అవసరమొచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కరోనా మహమ్మారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి: Rape Case: మైనర్‌పై రేప్.. ప్రముఖ టీవీ నటుడు అరెస్టు