విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో ఆయా రాష్ట్రాలకు చెందిన వారు తమ పండుగలను సంతోషంగా జరుపుకుంటారు. అందులో భాగంగా కాగజ్‌నగర్‌లో ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు చెందిన ప్రజలు సూర్యదేవుడికి చేసే పూజలైన ఛట్ వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్థానిక ఎస్పీఎం క్రీడామైదానంలోని కొలనుల్లో ఈ పూజలు నిర్వహించారు. ఈ వేడుకలు శుక్రవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి.
సాయంత్రం నాలుగు గంటలకు ఇళ్లలో తయారుచేసిన పిండి పదార్థాలు, ఫలహారాలు, పండ్లను, ఒక గంపలో తీసుకుని కుటుంబ సమేతంగా కొలను వద్దకు చేరుకుంటారు. సూర్యుడు అస్తమించే వరకు ఆ కొలనులో పూజలు చేస్తారు. మరుసటి రోజు ఉదయం నాలుగు గంటలకు కొలనులో నిలబడి సూర్యుడు ఉదయించే వరకు పూజలు చేసి సూర్య దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు. అనంతరం ఈ పండుగ ముగుస్తుంది.
మూడు రోజుల పాటు జరిగే పండుగలో ఉపవాస దీక్షలు చేస్తారు. సూర్యుడికి ఛట్ పూజలు చేయడం వల్ల కుటుంబం సుఖ సంతోషాలతో పాటు, కోరిన కోరికలు ఫలిస్తాయని నమ్మకం. ఈ ఛట్ పూజల ముగింపు కార్యక్రమంలో ఎస్పీఎం పరిశ్రమ ప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ పూజలను తిలకించేందుకు పట్టణంలోని ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చారు.
ఇదీ చదవండి: బిహార్: 'ఛట్' పండుగ రోజు విషాదం.. 30 మంది మృతి