ఖమ్మం జిల్లా ఇల్లందు పట్టణం 14నంబరు బస్తీకి చెందిన ఓ యువతి కొన్నేళ్లుగా మూత్రపిండ సమస్యతో బాధపడుతోంది. డయాలసిస్ చేయించుకునేందుకు తరచూ హైదరాబాద్ వైద్యశాలకు వెళ్లి వస్తుండేది. ఈ నెల 27న చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లింది. అక్కడ ఈమె కరోనా నమూనాలను సేకరించి వరంగల్ ఎంజీఎం వైద్యశాలకు పంపించారు. యువతికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు బుధవారం రాత్రి ఇల్లందు వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. గాంధీ వైద్యశాలకు తీసుకెళ్లాలని సూచించారు. కొత్తగూడెం నుంచి వచ్చిన ప్రత్యేక అంబులెన్స్‌లో యువతిని అర్ధరాత్రి తరలిస్తున్న క్రమంలో కరెంట్ ఆఫీసు ఏరియా వద్ద ఆమె ప్రాణాలొదిలింది.
అన్నం ఫౌండేషన్ బృందం సహకారంతో...
మృతి చెందిన యువతి అంత్యక్రియల నిర్వహణకు కుటుంబ సభ్యులు, స్థానికులు ఎవరూ ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న ఖమ్మానికి చెందిన అన్నం ఫౌండేషన్ ఛైర్మన్ అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బృందం చంటి, రవి, సురేశ్, రాజేశ్ ఇల్లందుకు వచ్చి ఆమె అంత్యక్రియలు నిర్వహించి ఔదార్యం చాటారు. వైద్య, ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారం అధికారుల సమక్షంలో పూర్తి చేశారు.
50మంది స్వీయ గృహ నిర్బంధం:
పురపాలక ఛైర్మన్ డీవీ, కమిషనరు ఎ.శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దారు ఎం.మస్తాన్‌రావు, వైద్యులు వరుణ్, సీఐ డి.వేణుచందర్ సిబ్బందితో వెళ్లి సదరు యువతిని కలిసిన వారి వివరాలు తెలుసుకున్నారు. ప్రాథమిక, సెకండరీ కాంటాక్టు మొత్తం 50మందిని స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలని వారు సూచించారు.