ఖమ్మం జిల్లాలో పలు రకాల ఔషధ పండ్ల మొక్కలను పెంచుతున్నారు పర్యావరణ ప్రేమికులు. మధిరకు చెందిన మేదరమెట్ల నవీన్ కుమార్ గత ఐదేళ్లుగా ఇంటి ఆవరణను మొక్కల పెంపకానికి కేంద్రంగా మార్చుకున్నారు. నివాసం చుట్టూ నీడనిచ్చే చెట్లు, తీగలకు వేలాడే ఆకులను అల్లుకున్న నందనవనంగా తన ఇంటిని తీర్చిదిద్దారు.
ఇంటిపై భాగంలోనూ..
ఇంటిపై భాగంలోనూ.. పలు రకాల మొక్కలను పెంచుతున్నారు. మరో పర్యావరణ ప్రేమికుడు చెరుకూరి నాగార్జున ఏకంగా నర్సరీలను ఏర్పాటు చేశాడు. వందల రకాల మొక్కలను పోషిస్తూ.. ఆసక్తి కలిగిన గృహస్తులకు, రైతులకు తక్కువ ధరకే శిక్షణ అందిస్తూ.. ప్రోత్సాహం అందిస్తున్నాడు.
ప్రతి రోజు నీరు..
పూర్తి సేంద్రియ విధానాలతోనే మొక్కలను పెంచుతూ.. రోజూ ఉదయం వ్యాయామంలో భాగంగా వాటికి పాదులు తీసి నీరు పోస్తున్నారు. ఓ వైపు ఆరోగ్యం.. మరోవైపు ఆహ్లాదాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఇంటి అవసరాలకు సరిపడా ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలను పెంచటం ఇక్కడ ప్రత్యేకత. వీరిని చూసిన కాలనీ వాసులు మొక్కల పెంపకానికి, తద్వారా పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించడం హర్షనీయం.