రాష్ట్రంలో పరీక్షలు రాసే విద్యార్థులకు హాజరుశాతం తప్పనిసరి చేయొద్దని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ప్రతి విద్యార్థి పరీక్ష రాసేలా చూడాలని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్‌కు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.
ఖమ్మం జిల్లాలో పర్యటించిన సబితా ఇంద్రారెడ్డి.. మంత్రి పువ్వాడతో కలిసి ఆరు కస్తూర్బా విద్యాలయాలు ప్రారంభించారు. అనంతరం జిల్లాలో పాఠశాలల పునఃప్రారంభంపై సమీక్ష నిర్వహించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పదో తరగతి పరీక్షలు మే చివరి వరకు పూర్తయ్యేలా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఒకరోజు, రెండో సంవత్సరం విద్యార్థులకు మరోరోజు తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి సబిత వెల్లడించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో.. దూరదర్శన్, టీశాట్ ద్వారా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. బాసర ఐఐటీకి డిమాండ్ విపరీతంగా ఉన్నందున ఐఐటీలు పెంచే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
- ఇదీ చూడండి : 'కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యక్ష బోధన'