Principal of Gurukula Girl Hostel Who Beat Students: మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల బాలికల వసతి గృహంలో ప్రిన్సిపల్ విచక్షణారహితంగా కొట్టారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా మధిరలో చోటుచేసుకుంది. ప్రిన్సిపల్ కొట్టడంతో కొందరు విద్యార్థినులకు గాయాలయ్యాయి. విద్యార్థినులకు పదో తరగతిలో తక్కువ మార్కులు రావడంతోనే కొట్టానని ఆమె పేర్కొన్నారు.
బాలికలు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాలోని మధిరలో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల బాలికల వసతి గృహంలో ఉంటున్న పదో తరగతి ప్రిన్సిపల్ నజీమా కర్రలతో కొట్టారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈ వసతి గృహానికి ఒక విద్యార్థి సంఘం నాయకుడు రాగా.. తనకి భోజనం సరిగ్గా ఉండడం లేదని, కూరలు సక్రమంగా ఉండడం లేదని చెప్పామన్నారు. ఆ విద్యార్థి సంఘం నాయకుడు వెళ్లిన తర్వాత ఒక గదిలోకి తీసుకెళ్లి.. ఇక్కడ జరిగే విషయాలు బయటకు చెప్పితే కొడతానని ప్రిన్సిపల్ బెదిరించారని బాలికలు తెలిపారు. అదే విధంగా హాస్టల్‌పై ఉన్న ఒక గదిలోకి వెళుతుంటే వెళ్లవద్దని చెప్పి కొట్టారన్నారు.
మీడియాతో మార్కులు తక్కువగా రావడం వల్లే కొట్టేనని ప్రిన్సిపల్ చెప్పిన మాట అవాస్తవమని విద్యార్థినులు అన్నారు. ఇప్పటివరకూ 20 మంది విద్యార్థినులను కొట్టి గాయపర్చారని వాపోయారు. ఎటువంటి కారణం లేకుండా ప్రతిసారి విపరీతంగా కొడుతున్నారని.. దీంతో తాము భయాందోళనలకు గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. శరీరంపై కమిలిన గాయాలను చూపిస్తూ.. వారు విలపిస్తున్నారు.
ఈ విషయంపై ప్రిన్సిపల్ నజీమా.. విద్యార్థినులపై తనకు ఎటువంటి కోపం లేదని, కేవలం మార్కులు తక్కువ రావడం వల్లే కొట్టి మందలించానని ఆమె పేర్కొన్నారు. గురుకులంలో నాణ్యమైన భోజనమే అందిస్తున్నామని తెలిపారు. హాస్టల్‌పై రూంలోకి వెళుతుంటే కొట్టినట్లు చెప్పిన మాటలు అవాస్తవం అని వివరించారు.
"ఈ గురుకులంలో గత ఐదేళ్లగా చదువుతున్నాము. అసలు ఇప్పటివరకు ఏ ఉపాధ్యాయుడు మమ్మల్ని కొట్టలేదు. ప్రిన్సిపల్ వచ్చి పదోతరగతిలో చదవలేదన్న కారణంతో కొట్టారు. భోజనం సరిగ్గా లేదు. ఎండుమిర్చిని దంచి కారంగా చేస్తున్నారు. ఆడపిల్లలం అవ్వడం వల్ల గ్యాస్ సమస్యలు వస్తున్నాయి. హాస్టల్ పై గదిలోకి వెళితే ప్రిన్సిపల్ కొడుతున్నారు." - విద్యార్థినులు
ఇవీ చదవండి: