సాగర్ జలాల విడుదల నేపథ్యంలో ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని కాల్వలను ఎమ్మెల్యే రాములు నాయక్, మార్క్‌ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్ పరిశీలించారు. ఏన్కూరు మండలంలో రెగ్యులేటర్లు, కాల్వ కట్టల పటిష్టతను పరిశీలించి.. ఎన్ఎస్పీ అధికారుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. రెగ్యులేటర్ల వద్ద తలుపుల నుంచి నీటిపారుదలకు అవసరమైన పరికరాలు ఉన్నాయా లేదా అనే అంశంపై అధికారులను ప్రశ్నించారు. ప్రధాన కాలువ నుంచి వైరా జలాశయానికి నీటిని మళ్లించే ఎస్కేప్‌ను పరిశీలించారు. ఎస్కేప్ వద్ద తలుపులు సరిగా లేకపోవడం వల్ల షటర్లు దింపడం లేదని రైతులు ఎమ్మెల్యే ఎదుట వాపోయారు. దీనివల్ల పక్కనే ఉన్న వాగు నుంచి దాటలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
సాగర్ జలాలు వైరా జలాశయానికి విడుదల చేసిన సమయంలో వాగు నుంచి వెళ్లే వరదతో ఇబ్బంది పడుతున్నామని... వంతెన లేక దిగుబడులు, ఎరువులు రవాణా చేసుకోలేక పోతున్నామని ఎమ్మెల్యేకు విన్నవించారు. రైతుల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే ఈ ఏడాది వంతెన నిర్మాణానికి చర్యలు చేపడతామని తెలిపారు. తాత్కాలిక ఏర్పాట్లపై నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడుతానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీటి వనరులు కల్పిస్తుందని ప్రాజెక్టులతో పాటు సాగర్ జలాలు విడుదల చేసి ఖరీఫ్‌కు నీటి ఇబ్బందుల్లేకుండా చేస్తుందన్నారు. సాగర్ జలాలు పొదుపుగా వాడుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల వైరా నియోజకవర్గ డీఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తీర్పు రిజర్వ్ చేసిన ఎన్జీటీ