ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించారు. పత్తి కొనుగోళ్లలో జిన్నింగ్ మిల్లులు, సీసీఐ బాధ్యులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించారు. సీసీఐ ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.5,825 చెల్లించాలని తెలిపారు. రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 129 క్లస్టర్లలో రైతు వేదికలు ఏర్పాటు చేసిందన్నారు.
రైతు ఆవేదనపై మంత్రి స్పందన
మంత్రి మాట్లాడుతున్న సందర్భంలో ఓ రైతు... జిన్నింగ్ మిల్లుల వద్ద తరుగు రూపంలో 20 కిలోల వరకు పత్తి తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేయగా.. మంత్రి స్పందించారు. తేమశాతం నిర్ధరణ కోసం పత్తి బస్తాల నుంచి అవసరం మేరకే పత్తిని తీసుకోవాలని... అధికంగా తీస్తే చర్యలు తప్పవని పువ్వాడ హెచ్చరించారు. జిల్లా స్థాయి అధికారులతో పాటు తానూ కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తానన్నారు. రైతులకు అన్యాయం జరిగినట్లు దృష్టికి వస్తే బాధ్యులపై చర్యలు తప్పవన్నారు.
ఇదీ చూడండి: తెలంగాణలో అమలు కాబోతోన్న డిజిలాకర్ విధానం!